రైల్వే ప్రయాణికులకు చేదు వార్త- 300కి పైగా ట్రైన్స్ రద్దు..!

తీర్థయాత్రలకు, పర్యటక ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారికి, సాధారణ రైలు ప్రయాణికులకి బ్యాడ్ న్యూస్. ఝాన్సీ డివిజన్తో సహా వివిధ ప్రదేశాలను సందర్శించడానికి అడ్వాన్స్‌డ్ కన్ఫర్మ్ రైలు టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను పునర్ సమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వివిధ మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల 300కి పైగా ట్రిప్పులు రద్దు అవ్వనున్నాయి. మరికొన్ని రైళ్లను దారిమళ్లించనున్నారు. భద్రతా అప్గ్రేడ్ పనులను ప్రారంభించడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

‘అభివృద్ధి పనుల వల్ల రైలు ట్రిప్పులు రద్దు’
300కి పైగా రైలు ట్రిప్పులు రద్దవ్వడంపై నార్త్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శశికాంత్ త్రిపాఠి స్పందించారు. సురక్షితమైన రైలు కార్యకలాపాల కోసం రైల్వే స్టేషన్లలో బ్యాలస్ట్ లేని ట్రాక్‌లను తిరిగి అభివృద్ధి చేస్తామని చెప్పారు. “సాంప్రదాయ ట్రాక్‌లలో, ట్రాక్‌ల కింద నీరు పేరుకుపోతుంది. ఈ నీరు కొంతకాలం తర్వాత బేస్‌ను బలహీనపరుస్తుంది. అయితే ట్రాక్‌ల కింద నీరు నిల్వ ఉండకుండా బ్యాలస్ట్లేని ట్రాక్లను డెవలప్ చేస్తాం. అలా చేయడం వల్ల వర్షం లేదా ఇతర కారణాల వల్ల ట్రాక్ పైకి వచ్చే నీరు డ్రైనేజీ ద్వారా బయటకు పోతుంది” అని త్రిపాఠి వెల్లడించారు.

నవంబర్ 25- జనవరి 8 వరకు పనులు!
ఈ ఏడాది నవంబర్ 25- జనవరి 8 వరకు బ్యాలస్ట్ లేని ట్రాక్ పనులు జరగనున్నాయి. అంతవరకు కొన్ని రైలు ట్రిప్పులు పాక్షికంగా రద్దవ్వనున్నాయి. మరికొన్నింటిని దారిమళ్లించనున్నారు. అయితే రైలు ట్రిప్పుల రద్దుపై దిల్లీకి చెందిన ప్రయాణికుడు మధుసూదన్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. రైలు ప్రయాణీకుల కోసం కొన్ని ఆధునిక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. అయితే రైల్వే ఒక ప్రధాన విభాగంలో అనేక రైలు ట్రిప్పులను రద్దు చేయడం, దారి మళ్లించడం తనకు కోపం తెప్పించిందన్నారు. విమాన ప్రయాణ ఖర్చులను భరించలేని దిగువ మధ్యతరగతి, పేద ప్రయాణికులు ఎటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కోకుండా వారికి ఉపశమనం కలిగేలా అధికారులు సరైన ప్రణాళికను రూపొందించాలని కోరారు. మరోవైపు, సురక్షితమైన రైలు ప్రయాణం కోసం బ్యాలస్ట్ లేని ట్రాక్‌లను అభివృద్ధి చేస్తున్నాయనేది వాస్తవమైతే, అది మంచి చర్యేనని మరో ప్రయాణికుడు లోచన్ సింగ్ కొనియాడారు. ప్రయాణీకుల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు అధికారులు ఇలాంటి పనులను చేసుకోవాలని సూచించారు.

రద్దైన రైళ్లు ఇవే వివరాలు!

రైలు నెంబరు (11901) వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ – ఆగ్రా కాంట్కు రోజువారీ నడిచే రైలు నవంబర్ 26- జనవరి 9 వరకు రద్దైంది.
రైలు నెంబరు (11902) ఆగ్రా కాంట్- వీరంగన లక్ష్మీబాయి ఝాన్సీ (రోజువారీ) నవంబర్ 25-జనవరి 8 వరకు రద్దు
రైలు నెంబరు (11903) వీరంగన లక్ష్మీబాయి ఝాన్సీ – ఇటావా (రోజువారీ) నవంబర్ 25- జనవరి 8 వరకు రద్దు.
రైలు నెంబరు (11904) ఇటావా-వీరంగన లక్ష్మీబాయి ఝాన్సీ (రోజువారీ) నవంబర్ 26- జనవరి 9 వరకు రద్దు.
రైలు నెంబరు (64616) వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ-లలిత్‌ పుర్ MEMU (రోజువారీ) నవంబర్ 25- జనవరి 8 వరకు రద్దు.
రైలు నెంబరు (64615) లలిత్‌ పుర్-వీరంగన లక్ష్మీబాయి ఝాన్సీ MEMU (రోజువారీ) నవంబర్ 25- జనవరి 8 వరకు రద్దు.
రైలు నెంబరు (64618) లలిత్‌ పుర్-బినా MEMU (రోజువారీ) నవంబర్ 25- జనవరి 8 వరకు రద్దు.
రైలు నెంబరు (64617) బినా-లలిత్‌ పుర్ MEMU (రోజువారీ) నవంబర్ 25- జనవరి 8 వరకు రద్దు.
రైలు నెంబరు (07075) హైదరాబాద్-గోరఖ్‌ పుర్ (వీక్లీ ఒకసారి (శుక్రవారం)) నవంబర్ 28- జనవరి 2 వరకు రద్దు.
రైలు నెంబరు (07076) గోరఖ్‌ పుర్-హైదరాబాద్ (వీక్లీ ఒకసారి (ఆదివారం)) నవంబర్ 30- జనవరి 4 వరకు రద్దు. ఈ రైళ్లు సహా మరికొన్ని రద్దయ్యాయి.