ఉత్తరకొరియా బిగ్‌ వార్నింగ్‌..!

డొనాల్డ్ ట్రంప్‌తో సంబంధాలు మెరుగుపడతాయన్న సంకేతాలు ఉన్నప్పటికీ.. ఉత్తర కొరియా తన అణ్వాయుధాలను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది..పైగా అమెరికా విధానాన్ని ఇప్పటికీ తమకు శత్రుత్వపూరితంగానే చూస్తున్నామని ఉత్తర కొరియా చెబుతోంది.

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెబుతున్నారు. ఉత్తర కొరియాతో మరోసారి శిఖరాగ్ర సమావేశం నిర్వహించేందుకు కూడా ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను కూడా ట్రంప్ తగ్గించారు. అయితే, ఇలాంటి చర్యలు ఉన్నప్పటికీ ఉత్తర కొరియా మాత్రం అమెరికాపై తన వైఖరిని మార్చుకోలేదు. తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించింది.

ఒత్తిడి పెంచే చర్యలే: ఉ.కొరియా.

ఉత్తర కొరియా సోమవారం అమెరికాపై తీవ్ర విమర్శలు చేసింది. అమెరికా తమపై కొనసాగిస్తున్న విధానం ఇప్పటికీ శత్రుత్వపూరితంగానే ఉందని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర కొరియాను పూర్తిగా అణ్వాయుధ రహిత దేశంగా మార్చాలన్న అమెరికా డిమాండ్, ఉత్తర కొరియా మానవ హక్కుల పరిస్థితిపై అమెరికా విమర్శలు, అమెరికా-దక్షిణ కొరియా-జపాన్ సైనిక సహకారం తమపై ఒత్తిడి పెంచే చర్యలేనని ఉత్తర కొరియా ఆరోపించింది..