రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు…!

ట్రంప్ ప్రభుత్వం రష్యా ఆంక్షల బిల్లు తీసుకొచ్చింది. ఆ బిల్లు ప్రకారం ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తున్న రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడం, ఇంధన ఎగుమతుల ద్వారా వస్తున్న ఆదాయాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం..రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్‌ కొనుగోలు చేసే దేశాలన భారత్, చైనాలతో సహా ఏకంగా 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభించింది. సెప్టెంబర్ 18, 2026న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిల్లుపై సంతకం చేయడంతో అధికారికంగా చట్టంగా మారింది.

అయితే ప్రస్తుతం జిన్‌పింగ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం అమెరికాకు వెళ్లారు. ఇక జిన్‌పింగ్‌కు ట్రంప్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు ఇవ్వొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రెండు దేశాల విషయంలో వాషింగ్టన్ వేర్వేరు విధానాలను అనుసరిస్తుందా? అనే చర్చ మొదలైంది.

ప్రస్తుతానికి దీనిపై స్పష్టమైన సమాధానం లేదు. అమెరికా-చైనా వాణిజ్య సంధి పొడిగింపు మాత్రమే చైనాకు కొత్త రష్యా సంబంధిత టారిఫ్ నిబంధనల నుంచి ఆటోమేటిక్ మినహాయింపు ఇచ్చినట్లు అర్థం కాదు. చైనాకు ప్రత్యేక మినహాయింపు ఉంటే.. దానిని అమెరికా అధికారిక నిర్ణయం లేదా అమలు పత్రం ద్వారా స్పష్టం చేయాల్సి ఉంటుంది.

అమెరికా-చైనా ట్రేడ్ ట్రూస్ ఏంటి?

అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఒప్పందాన్ని ‘బుసాన్ అగ్రిమెంట్’గా పేర్కొంటున్నారు. 2025లో దక్షిణ కొరియాలోని బుసాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమైన తర్వాత ఈ వాణిజ్య అవగాహన ఏర్పడింది. గతంలో ఇరు దేశాలు పరస్పరం భారీగా టారిఫ్‌లు పెంచుకున్న నేపథ్యంలో.. ఈ ఒప్పందం ద్వారా కొంత టారిఫ్ ఒత్తిడి తగ్గింది. అరుదైన ఖనిజాలు, కీలక ముడి పదార్థాలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఒప్పందం తొలుత నవంబర్ 10తో ముగియాల్సి ఉండగా.. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సెప్టెంబర్ 24న ఇరు దేశాలు దీనిని 2027 జనవరి 10 వరకు పొడిగించేందుకు అంగీకరించినట్లు తెలిపారు.

భారత్, చైనాకు గతంలో వేర్వేరు ట్రీట్‌మెంట్

ఇదే అంశంపై 2025లో అమెరికా అనుసరించిన విధానం కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. 2025లో రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా భారత్ నుంచి వచ్చే వస్తువులపై అమెరికా అదనంగా 25 శాతం టారిఫ్ విధించింది. అదే సమయంలో చైనాపై రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి ఇలాంటి అదనపు టారిఫ్‌ను విధించలేదు. చైనా విషయంలో ఈ అంశం విస్తృత అమెరికా-చైనా చర్చల్లో భాగంగా కొనసాగింది. అయితే గతంలో తీసుకున్న నిర్ణయం.. 2026లో కొత్త చట్టం కింద తప్పనిసరిగా అదే విధంగా అమలవుతుందని చెప్పలేం.