కేంద్ర ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండాలి ..। వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..

దేశంలో ప్రజాస్వామ్యం పరివర్తనం చెందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇటీవల ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఓటర్ల జాబితాల నిర్వహణపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు ప్రజల్లో తీవ్ర అనుమానాలను రేకెత్తించాయని పేర్కొంటూ ఆయన ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఎలక్షన్ కమిషనర్ల నియామకంలో CJI ఉండాలి..

కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల్లో ఉన్న భయాలను తొలగించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. “గతంలో మేము మద్దతు తెలిపిన ‘కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం-2023’ని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పునఃపరిశీలించాలి. ప్రధాని, ప్రతిపక్ష నేతతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సభ్యులుగా ఉండే ముగ్గురు సభ్యుల నిష్పాక్షిక కమిటీ ద్వారానే కమిషనర్లను నియమించేలా చట్టసవరణ తీసుకురావాలి. పరీక్ష రాసే విద్యార్థే ఎగ్జామినర్‌ను ఎంచుకునే విధానం ఎంత నిజాయితీగా ఉన్నా ఆరోపణలకు తావిస్తుంది. కాబట్టి తటస్థ వ్యవస్థ ద్వారా నియామకాలు చేపడితేనే ఈసీపై ప్రజల్లో గౌరవం, విశ్వాసం పునరుద్ధరించబడతాయి” అని జగన్ స్పష్టం చేశారు.