రూ.10 వేలు UPI పేమెంట్ చేస్తే.. MDR ఛార్జీలు…

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ చెల్లింపుల కోసం కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) విధి విధానాలను విడుదల చేసింది. రూ.2వేల కంటే ఎక్కువ విలువైన మర్చంట్ పేమెంట్ లావాదేవీలపై 0.4 శాతం మేర MDR వర్తించనుంది. ఈ కొత్త రూల్ అక్టోబర్ 15, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. వ్యాపారి నుంచి వసూలు చేసే ఫీజును యూపీఐ వ్యవస్థలోని వివిధ భాగస్వాములకు ఏ విధంగా పంచుతారనే దానిపై స్పష్టమైన విధివిధానాలను NPCI ప్రకటించింది.

బ్యాంకుల మధ్య పంపిణీ

సుమారు 40 బేసిస్ పాయింట్ల ఈ MDR విధానం ద్వారా మొత్తం డిజిటల్ చెల్లింపుల ఎకోసిస్టమ్ వార్షికంగా రూ.16,000 కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందని అంచనా. ఈ విధంగా వచ్చే ఆదాయం ఖాతాలను జారీ చేసే బ్యాంకులు , లబ్ధిదారు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్(PSP) బ్యాంకులు, మర్చంట్ అక్వైరింగ్ సంస్థలు, NPCI వంటి వివిధ భాగస్వాముల మధ్య విభజిస్తారు.

ఇందులో NPCI ప్రతి లావాదేవీకి స్విచింగ్ ఫీజు రూపంలో సుమారు 0.02 bps స్థిర రుసుమును పొందుతుంది. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి ప్రముఖ యూపీఐ యాప్‌లు బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా సేవలు అందిస్తుండగా, యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ , ఎస్‌బీఐ బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకులు ఈ ఎకోసిస్టమ్‌లో కీలకమైన పీఎస్‌పీ బ్యాంకులుగా వ్యవహరిస్తున్నాయి.
మొత్తం MDR మొత్తంలో అత్యధికంగా 40 శాతం వాటాను కస్టమర్ ఖాతాను నిర్వహించే బ్యాంకు పొందుతుంది. ఉదాహరణకు రూ.10వేల లావాదేవీపై రూ.40 ఛార్జీ వసూలైతే ఇందులో రూ.16 ఈ బ్యాంకుకే వెళుతుంది.

2. మర్చంట్ అక్వైరర్లు (వ్యాపారి ఖాతా బ్యాంకు): వ్యాపారులకు పేమెంట్స్ స్వీకరించే సేవలను అందించే అక్వైరర్ బ్యాంకులకు 30 శాతం అంటే రూ.10వేల పేమెంట్ పై రూ.12 దక్కుతుంది.

3. యూపీఐ యాప్స్: ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ అప్లికేషన్లను నిర్వహించే సంస్థలకు 20 శాతం అంటే రూ.10వేల చెల్లింపుపై రూ.8 వాటా వస్తుంది.

4. బ్యాంక్ పార్టనర్స్: యూపీఐ యాప్‌లకు టెక్నికల్ అండ్ బ్యాంకింగ్ సేవలను అందించే పార్ట్నర్ బ్యాంకులకు మిగిలిన 10 శాతం అంటే రూ.10వేల పేమెంట్ పై రూ.4 వాటా అందుతుంది.

కస్టమర్లు, వ్యాపారులపై ప్రభావం?
సాధారణ వ్యక్తుల మధ్య జరిగే పీపుల్-టు-పీపుల్ యూపీఐ ట్రాన్సాక్షన్లు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితం. అలాగే రూ.2వేల లోపు ఉండే రోజువారీ చిన్నచిన్న లావాదేవీలపై ఎలాంటి MDR ఉండదు. అంతేకాకుండా వ్యాపారులు ఎవరూ కూడా ఈ MDR చార్జీలను కస్టమర్లపై రుద్దడానికి వీల్లేదని NPCI స్పష్టం చేసింది. యూపీఐ యాప్‌లు కూడా వినియోగదారుల నుంచి ఎలాంటి ప్లాట్‌ఫామ్ ఫీజులు వసూలు చేయడానికి అనుమతి లేదు.

2020 నుంచి ఎలాంటి మర్చంట్ ఫీజు లేకుండా నడుస్తున్న యూపీఐ వ్యవస్థను మెుత్తానికి ఛార్జీల కిందకు తీసుకొచ్చింది మోడీ సర్కార్. ఈ ఛార్జీలను వ్యాపారులు భరించటానికి ఇష్టపడరు కాబట్టి వారు యూపీఐ చెల్లింపుల స్వీకరణను తగ్గించే అవాకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇది మళ్లీ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ పేమెంట్స్ నుంచి ప్రజలు డబ్బు వాడకం దిశగా పురిగొల్పుతుందని హెచ్చరిస్తున్నారు.