అమెరికా గడ్డ మీద గులాబీ దళం అలయ్‌-బలయ్‌…

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు.. మరోవైపు బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవాలతో అమెరికాలోని డాలస్‌ నగర వీధులు, డాక్టర్‌ పెప్పర్‌ ఎరీనా ప్రాంగణమంతా ‘జై తెలంగాణ’ నినాదాలతో మార్మోగింది. అమెరికా గడ్డ మీద గులాబీ దళం అలయ్‌-బలయ్‌ తీసుకున్నది. అమెరికా సంయుక్త రాష్ర్టాల్లోని తెలంగాణబిడ్డలు, తెలంగాణ నుంచి వెళ్లిన మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్యనేతలతో డాలస్‌ పట్టణం సంబురంతో ఊగిపోయింది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు డాలస్‌కు చేరుకున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు పార్టీ ఎన్నారై సెల్‌ గ్లోబల్‌ కో-ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల, బీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ అడ్వైజరీ చైర్మన్‌ మహేశ్‌ తన్నీరు సారథ్యంలో ఎన్నారైలు అపూర్వస్వాగతం పలికారు.

ఆదివారం సాయంత్రం 4 గంటలకు (భారత కాలమానం ప్రకారం జూన్‌ 2వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు) యూఎస్‌ఏలోని డాలస్‌ నగరంలోని డాక్టర్‌ పెప్పర్‌ ఎరీనాలో రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు, బీఆర్‌ఎస్‌ రజతోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో అమెరికా సంయుక్త రాష్ర్టాల్లోని దాదాపు అన్ని రాష్ర్టాలు, అన్ని ప్రధా న నగరాల్లోని తెలంగాణ బిడ్డలు డాలస్‌కు చేరుకోవడంతో సందడి నెలకొన్నది. న్యూజెర్సీ, చికాగో, డెలావేర్‌, హ్యూస్టన్‌, టెక్సాస్‌, కొలంబస్‌, ఆస్టిన్‌, ఫ్లోరిడా, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ఏంజెల్స్‌, న్యూయార్క్‌ తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా తెలంగాణబిడ్డలు డాలస్‌కు తరలివచ్చారు.

యూఎస్‌ఏలోని పలు ప్రాంతాల్లో ఉం టున్న తెలంగాణబిడ్డలు డాలస్‌ వేదిక వద్దకు తెలంగాణలోని తమతమ సొంత జిల్లాల సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలు ఉట్టిపడేలా వేషధారణ, చిత్రపటాలు చేబూని రావడంతో డాక్టర్‌ పెప్పర్‌ ఎరీనా ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాలస్‌ ప్రాంగణంలో ఏ ఇద్దరు ఎదురుపడినా ‘హాయ్‌.. నమస్తే’కు బదులు ‘జై తెలంగాణ…జైజై తెలంగాణ’, ‘జై కేసీఆర్‌… జైజై కేసీఆర్‌’ అంటూ పలకరించుకోవడం ప్రత్యేక ఆకర్షణ అయింది. తెలంగాణలో ప్రస్తుతం అన్ని వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని పారద్రోలే శక్తి, సత్తా ఒక్క కేసీఆర్‌కే ఉన్నదని తెలంగాణ ఎన్నారైలు చర్చించుకోవడం కనిపించింది..