ద‌క్షిణ ఇరాన్‌లో అమెరికా మిలిట‌రీ దాడులు..!

ద‌క్షిణ ఇరాన్‌లో అమెరికా మిలిట‌రీ తాజాగా దాడులు(US Military Strikes) చేసింది. ద‌క్షిణ ఇరాన్‌లో ఉన్న క్షిప‌ణి కేంద్రాలు, మైన్లు అమ‌ర్చుతున్న బోట్ల‌ను టార్గెట్ చేసింది. అమెరికా సెంట్ర‌ల్ క‌మాండ్ దీనిపై ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసింది. ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో భాగంగా ఆ దాడులు చేసిన‌ట్లు చెప్పింది. ఇరానీ ద‌ళాల నుంచి త‌మ బ‌ల‌గాల‌కు ముప్పు పొంచి ఉన్న నేప‌థ్యంలో తాజా అటాక్ చేసిన‌ట్లు సెంట్ర‌ల్ కమాండ్ పేర్కొన్న‌ది. కాల్పుల విర‌మ‌ణ స‌మ‌యంలో సంయ‌మ‌నం పాటిస్తూనే త‌మ ద‌ళాల‌ను ర‌క్షించుకునేందుకు దాడుల‌కు దిగుతున్న‌ట్లు సెంట్ర‌ల్ క‌మాండ్ ప్ర‌తినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ తెలిపారు. బంద‌ర్ అబ్బాస్ ప్రాంతంలో ఉన్న కొన్ని కేంద్రాల‌ను టార్గెట్ చేసిన‌ట్లు కెప్టెన్ హాకిన్స్ చెప్పారు.ద‌క్షిణ పోర్టు న‌గ‌రంగా బంద‌ర్ అబ్బాస్‌కు పేరున్న‌ది. ఇరానీ నౌకాద‌ళానికి ఈ న‌గ‌ర‌మే బేస్‌. హోర్ముజ్ జ‌ల‌సంధి మార్గంలో ఈ పోర్టు సిటీ ఉంది. పేలుళ్ల ఘ‌ట‌న‌కు చెందిన అంశాల‌పై బంద‌ర్ అబ్బాస్ అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు ఇరానీ మీడియా పేర్కొన్న‌ది. తాజా దాడుల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఇరాన్ మాత్రం స్పందించ‌లేదు. అయితే ఈ దాడుల వ‌ల్ల అమెరికా, ఇరాన్ మ‌ధ్య జ‌రుగుతున్న శాంతి ఒప్పంద ప్ర‌య‌త్నాల‌పై ఎటువంటి ప్ర‌భావం ప‌డుతుందో అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు.

అమెరికా తాజా దాడుల్లో న‌లుగురు ఇరానీ రెవ‌ల్యూష‌న‌రీ గార్డు స‌భ్యులు మృతిచెందిన‌ట్లు తెలిసింది. బంద‌ర్ అబ్బాస్ పోర్టు వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అమెరికా దాడులు చేసినా.. ఇరాన్‌తో త్వ‌ర‌లో డీల్ కుదిరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఖ‌తార్‌లో ఇవాళ చ‌ర్చ‌లు జ‌రగ‌నున్నాయ‌ని, దీంట్లో ఏదైనా ప్ర‌గ‌తి జ‌రుగుతుందో లేదో గ‌మ‌నించాల‌న్నారు.

చాలా అంశాల్లో చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ని, అవన్నీ డాక్యుమెంట్ కావ‌డానికి చాలా రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని జైపూర్‌లో మీడియాతో రూబియో తెలిపారు. ఇరాన్‌తో జ‌రిగే మంచి డీల్ జ‌రుగుతుంద‌ని, లేదంటే ఆ దేశంతో ఒప్పంద‌మే ఉండ‌ద‌ని, ఈ అంశంలో దేశాధ్య‌క్షుడు చాలా స్ప‌ష్టంగా ఉన్న‌ట్లు రూబియో చెప్పారు. హోర్ముజ్ జ‌ల‌సంధిని పూర్తిగా తెర‌వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు