అమెరికా సంచలన నిర్ణయం…కీలకమైన హర్మూజ్‌ జలసంధిపై పట్టు తెచ్చుకునేందుకు అమెరికా ‘ఆపరేషన్ హర్మూజ్’…!

అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధిపై పట్టు తెచ్చుకునేందుకు అమెరికా ‘ఆపరేషన్ హర్మూజ్’ ప్రారంభించింది..ఈ ఆపరేషన్‌లో భాగంగా, ఇరాన్‌కు చెందిన ఆస్తులను గుర్తించి వాటిని ధ్వంసం చేస్తామని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ ప్రకటించారు.

అమెరికా ఇప్పటికే ఏ-10 వార్‌హాగ్ దాడి విమానాలు, ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్లు, యూఎస్‌ఎస్ బాక్సర్ ఎఫ్-35 జెట్‌లను రంగంలోకి దించింది. వీటితో పాటు నాలుగు వేల మంది సైనికులను హర్మూజ్‌ జలసంధిలో మోహరించింది.

ఇరాన్ ఏర్పాటు చేసిన క్షిపణి లాంచర్లు, డ్రోన్లు, సీమైన్స్, పడవలు, మందుపాతరలను ధ్వంసం చేయడానికి అమెరికా చర్యలు ప్రారంభించింది. తక్కువ ఎత్తులో ఎగిరే అపాచీ హెలికాప్టర్లను కూడా వినియోగిస్తోంది. సీమైన్స్ తొలగించడానికి వారం రోజుల సమయం పట్టవచ్చని సమాచారం.

జనరల్ కెయిన్ ప్రకారం, హర్మూజ్‌ జలసంధి అణువణువును అమెరికా జల్లెడ పట్టనుంది. ఇరాన్‌కు చెందిన 120కి పైగా నౌకలు, 44 మందుపాతర నౌకలు, ఇతర ఆయుధ కేంద్రాలను గుర్తించి వాటిని ధ్వంసం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.