వికారాబాద్ రైల్వే స్టేషన్కు మహర్దశ.. రూ.27 కోట్లతో ఆధునీకరణ పనులు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు.కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
వికారాబాద్ రైల్వే స్టేషన్కు మహర్దశ.. రూ.27 కోట్లతో ఆధునీకరణ పనులు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు.. కవచ్ టెక్నాలజీతో రైలు భద్రతకు పెద్దపీట వికారాబాద్: వికారాబాద్ రైల్వే స్టేషన్కు మహర్దశ రానుంది. రూ.27 కోట్ల వ్యయంతో చేపడుతున్న స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు రైల్వే మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. వికారాబాద్తో పాటు తాండూర్, నాంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, మౌలాలి తదితర 40కి పైగా రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్లో అధునాతన సౌకర్యాలు వికారాబాద్ ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే స్టేషన్లో పలు అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఇందులో భాగంగా ఎస్కలేటర్, రెండు లిఫ్టులు, నూతన వెయిటింగ్ హాల్, విఐపీ లాంజ్, ఆధునిక పార్కింగ్ వసతులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో వికారాబాద్ రైల్వే స్టేషన్ మరింత సౌకర్యవంతంగా, ఆధునికంగా మారనుంది. రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణ రైల్వే రంగానికి భారీగా నిధులు కేటాయిస్తూ వేల కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వే ట్రాక్ల రెట్టింపు, మూడో, నాలుగో మార్గాల నిర్మాణ పనులు కూడా జోరుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో 100 శాతం రైల్వే విద్యుదీకరణ ఇప్పటికే పూర్తయిందని ఆయన తెలిపారు. రైలు ప్రయాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ దేశీయంగా అభివృద్ధి చేసిన ‘కవచ్’, ‘కవచ్ 2.0’ భద్రతా పరిజ్ఞానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి 5 వందే భారత్ రైళ్లు తెలంగాణలో వేగవంతమైన రైలు ప్రయాణానికి కూడా కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రస్తుతం 5 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయని, వీటి ద్వారా ప్రయాణికులకు వేగవంతమైన, ఆధునిక రైలు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పూర్తయితే ఈ ప్రాంత రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.