భారత యువ క్రికెట్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ మరోసారి అద్భుతం చేశాడు. ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు…ఈ సెంచరీతో అతను ఒకే దెబ్బకు రెండు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా, అత్యంత వేగంగా 3000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన భారత క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించాడు..
Yashasvi Jaiswal | అత్యధిక టెస్ట్ శతకాలు …
వెస్టిండీస్‌తో ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. రాహుల్ (38) స్టంప్ అవుట్ అయినప్పటికీ, జైస్వాల్ ఆ తర్వాత వచ్చిన యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌తో కలిసి అద్భుతంగా ఆడాడు. వీరిద్దరూ కలిసి 55 ఓవర్ల ఆట ముగిసే సమయానికి 150 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇన్నింగ్స్‌లోని 51వ ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు తీసి జైస్వాల్ తన 7వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత అతను తన చేతులతో హృదయాన్ని చూపిస్తూ సెలబ్రేట్ చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఇన్నింగ్స్‌లోనే యశస్వి జైస్వాల్ క్రికెట్లో 3000 పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. కేవలం 71 ఇన్నింగ్స్‌లలో ఈ మార్క్‌ను చేరుకోవడం ద్వారా అతను అరుదైన రికార్డు సృష్టించాడు. అత్యంత వేగంగా 3000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాటర్లలో జైస్వాల్ ఇప్పుడు సునీల్ గవాస్కర్ (69 ఇన్నింగ్స్‌లు) తర్వాత రెండవ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో అతను సౌరవ్ గంగూలీ (74 ఇన్నింగ్స్‌లు), విరాట్ కోహ్లీ (80 ఇన్నింగ్స్‌లు) వంటి దిగ్గజాల రికార్డులను ఒకే దెబ్బకు బద్దలు కొట్టాడు. జైస్వాల్‌కి ఇది 48వ టెస్ట్ ఇన్నింగ్స్ కాగా, ఓవరాల్‌గా 7వ టెస్ట్ సెంచరీ. అతని అంతర్జాతీయ కెరీర్లో వన్డేల్లో 15 పరుగులు, 22 టీ20 ఇన్నింగ్స్‌లలో 723 పరుగులు, ఒక టీ20 సెంచరీ ఉన్నాయి..యశస్వి జైస్వాల్‌కు ఈ సంవత్సరం (2025) టెస్ట్ క్రికెట్లో చాలా అద్భుతంగా సాగుతోంది. ఇది ఈ ఏడాదిలో అతను సాధించిన మూడవ టెస్ట్ సెంచరీ. గతంలో అతను ఈ ఏడాది జూన్-జూలైలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో రెండు సెంచరీలు నమోదు చేశాడు. అలాగే, భారత్‌లో ఆడిన టెస్టుల్లో కూడా ఇది అతని మూడవ సెంచరీ. 2024 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌పై ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో 209 పరుగులు, సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో 214 పరుగులు చేసి రెండు డబుల్ సెంచరీలు కూడా నమోదు చేశాడు. జైస్వాల్ అసాధారణమైన ఫామ్ భారత క్రికెట్‌కు శుభసూచకంగా మారింది.