యూట్యూబర్ జోసెఫ్‌ రావణ్‌కు న్యాయస్థానం మరోసారి జ్యుడీషియల్‌ రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ ..।

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ జోసెఫ్‌ రావణ్‌కు న్యాయస్థానం మరోసారి జ్యుడీషియల్‌ రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన మరికొన్ని రోజుల పాటు జైలులోనే కొనసాగనున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు, పలు కేసుల నేపథ్యంలో ఇప్పటికే అరెస్టయి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుల విచారణ కొనసాగుతున్న తరుణంలో జోసెఫ్‌ రావణ్‌ను గన్నవరం కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు తీవ్రత, పోలీసుల వాదనలను పరిశీలించిన జడ్జి ఆయన జ్యుడీషియల్‌ రిమాండ్‌ను ఈ నెల 22 వరకు పొడిగిస్తూ కీలక తీర్పునిచ్చారు. కేసు విచారణ దశలో ఉండటంతో న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా విద్వేష పూరితమైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో జోసెఫ్‌ రావణ్‌పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. చట్టపరమైన చర్యల్లో భాగంగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. రిమాండ్ పొడిగింపుతో ఆయన తరఫు న్యాయవాదులు బెయిల్ కోసం సన్నాహాలు చేస్తున్నారు.