భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అహ్మదాబాద్కు చెందిన అజిస్టా ఇండస్ట్రీస్ అనే సంస్థ.. అంతరిక్షంలో ప్రయాణిస్తున్న ఓ వస్తువును (శాటిలైట్ను) తన సొంత శాటిలైట్ ద్వారా ఫోటో తీసి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీన్నే సాధారణంగా ‘ఇన్-ఆర్బిట్ స్నూపింగ్’ లేదా సాంకేతిక భాషలో ‘స్పేస్-టు-స్పేస్ ఇమేజింగ్’ అని పిలుస్తుంటారు. అజిస్టా సంస్థ తయారుచేసిన 80 కిలోల బరువున్న AFR అనే శాటిలైట్.. ఫిబ్రవరి 3న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) ఫొటోలు తీసింది. ఈ కొత్త సాంకేతికతతో అంతరిక్షంలో తిరుగుతున్న ఇతర శత్రు దేశాల ఉపగ్రహాల కదలికలను కూడా గమనించవచ్చు.
ఈ శాటిలైట్ మొదటిసారి 300 కిలోమీటర్ల దూరం నుంచి.. రెండోసారి 245 కిలోమీటర్ల దూరం ఫొటోలు తీసింది. సెకనుకు కొన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ISSను ట్రాక్ చేసి 15 విభిన్న ఫొటోలు తీసింది. అత్యంత సవాలుతో కూడిన సూర్యకాంతి, హోరైజన్ పరిస్థితుల్లో కూడా ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. దీంతో అజిస్టా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రయోగం గురించి మాట్లాడారు. AFR శాటిలైట్ ఇప్పటికే పలువురు కస్టమర్లకు అధునాతన ఇమేజింగ్, రిమోట్ సెన్సింగ్ సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు నాన్ ఎర్త్ ఇమేజింగ్ (NEI) ద్వారా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తమ సామర్థ్యాన్ని నిరూపించిందని చెప్పారు. ప్రస్తుతం భారత్కు సంబంధించి సుమారు రూ.50 వేల కోట్ల విలువైన 50కి పైగా శాటిలైట్లు అంతరిక్షంలో ఉన్నాయి. వీటిని కాపాడుకునేందుకు ఇలాంటి సాంకేతికత చాలా అవసరం. ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేస్తే.. మన దేశం మీదకు వచ్చే శత్రు దేశాల క్షిపణులను కూడా ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా ఇలాంటి ప్రయోగాలు కేవలం ఇస్రో మాత్రమే చేసేది. కానీ ఓ ప్రైవేట్ సంస్థ ఈ స్థాయి సాంకేతికతను ప్రదర్శించడం భారత్లో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇందులో వాడిన అల్గారిథమ్స్, కెమెరా సిస్టమ్స్, ఇంజనీరింగ్ అంతా భారత్లోనే తయారయ్యాయి…2023, జూన్ 13న AFR శాటిలైట్ స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లింది. 80 కిలోల విభాగంలో ప్రైవేట్ రంగం తయారుచేసిన అతిపెద్ద శాటిలైట్ ఇదే. ఇదిలాఉండగా అజిస్టా సంస్థ తన తదుపరి లక్ష్యంగా 25 సెంటీమీటర్ల రిజొల్యుషన్తో అత్యంత స్పష్టమైన ఫోటోలను తీయగల పేలోడ్లను తయారు చేస్తోంది. దీంతో అంతరిక్షంలో ఉండే చిన్న వస్తువులను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. ఒకప్పుడు కేవలం ప్రభుత్వాలకే పరిమితమైన అంతరిక్ష వ్యూహాలు ఇప్పుడు భారత ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి రావడం కీలక మైలురాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది అంతరిక్షంలో భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని చెబుతున్నారు.