కుప్పకూలిన చైనా స్టాక్ మార్కెట్లు.. 20 శాతం పతనం..!

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న చైనా స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఆ దేశ ప్రధాన సూచీ అయిన సీఎస్ఐ 300 గురువారం నాటి ట్రేడింగ్‌లో బేర్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఈ ఏడాది జూన్ నెలలో నమోదైన గరిష్ఠ స్థాయి నుంచి ఈ సూచీ ఏకంగా 20 శాతం పతనమవడంతో మదుపరులలో ఆందోళన వ్యక్తమవుతోంది. గత పది వారాలుగా కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి ప్రస్తుతం మరింత తీవ్రరూపం దాల్చింది.

గురువారం నాటి సెషన్‌లో సీఎస్ఐ 300 సూచీ 1.8 శాతం వరకు నష్టపోయింది. ఈ సూచీలో షాంఘై, షెన్‌జెన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో నమోదైన 300 ప్రధాన కంపెనీలు ఉంటాయి. ఇతర కీలక సూచీలు సైతం భారీ నష్టాలను చవిచూశాయి. షాంఘై కంపోజిట్ ఇండెక్స్ 1.48 శాతం క్షీణించి 3,658.03 పాయింట్ల వద్ద ముగియగా, షెన్‌జెన్ కంపోనెంట్ ఇండెక్స్ 2.97 శాతం మేర కుంగిపోయింది. వృద్ధి ఆధారిత కంపెనీల సూచీ అయిన కై-నెక్స్ట్ ఇండెక్స్ ఏకంగా 4.37 శాతం కుప్పకూలింది. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ సూచీ కూడా 2.9 శాతం నష్టపోయింది. ముఖ్యంగా టెక్నాలజీ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

మార్కెట్ వర్గాల విశ్లేషణ ప్రకారం, ఈ భారీ పతనానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.

షాంఘై, షెన్‌జెన్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నమోదైన అత్యంత కీలకమైన 300 పెద్ద కంపెనీల పనితీరును పర్యవేక్షించే ఈ సీఎస్ఐ 300 సూచీ.. ఇప్పుడు వరుసగా 10వ వారం కూడా క్షీణత బాటలోనే సాగుతోంది. ఎల్‌ఎస్‌ఈజీ (LSEG) డేటా ప్రకారం.. ఈ వారం ఇప్పటివరకు ఈ సూచీ 2.6 శాతం పడిపోగా, గురువారం ఒక్కరోజే 1 శాతానికి పైగా క్షీణించింది. చైనా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే వరుసగా 10 వారాల పాటు నష్టాలను మూటగట్టుకోవడం ఇదే అత్యంత సుదీర్ఘమైన పతన పరంపర కావడం గమనార్హం. సాధారణంగా ఒక ప్రధాన మార్కెట్ సూచీ తన గరిష్టాల నుండి 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ పడిపోతే దానిని విశ్లేషకులు ‘బేర్ మార్కెట్’గా పరిగణిస్తారు…
చైనా మార్కెట్‌లో కొనసాగుతున్న ఈ నిరంతర పతనం స్థానిక కంపెనీల ఆదాయాలు, దేశీయ వినియోగం, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. పెల్లా ఫండ్స్ చైర్మన్ జోర్డాన్ స్విటానోవ్స్కీ విశ్లేషిస్తూ.. చైనా మార్కెట్ అధిక ఉత్పత్తి సామర్థ్యం, తీవ్రమైన పోటీ, పరిమితికి మించిన కార్పొరేట్ పెట్టుబడుల వంటి దీర్ఘకాలిక నిర్మాణాత్మక సమస్యలతో సతమతమవుతోందని పేర్కొన్నారు. విపరీతమైన పోటీ వల్ల అనేక పరిశ్రమలలో లాభాల మార్జిన్లు తీవ్రంగా క్షీణించాయి. దీంతో చైనా పారిశ్రామిక కంపెనీల లాభాల వృద్ధి ఈ ఏడాదిలోనే అత్యంత బలహీనమైన స్థాయికి పడిపోయింది. బ్యాటరీలు, ఈవీ (EV) భాగాల వంటి అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన పరిశ్రమలలో సైతం విపరీత పోటీ వల్ల కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి… రెండో త్రైమాసికంలో చైనా ఆర్థిక వృద్ధి రేటు (GDP) మూడేళ్ల కాలంలోనే అత్యంత నెమ్మదైన స్థాయికి పడిపోయింది. అక్కడ ఏళ్ల తరబడి వేధిస్తున్న రియల్ ఎస్టేట్ రంగా మందగమనం ప్రజల ఉపాధిని, కొనుగోలు శక్తిని పడగలేసింది. దీనికి తోడు చైనా మార్కెట్లో రిటైల్ (సాధారణ) ఇన్వెస్టర్ల వాటా విపరీతంగా ఉండటం అస్థిరతను మరింత పెంచుతోంది. హెచ్‌ఎస్‌బిసి (HSBC) నివేదిక ప్రకారం.. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి మార్కెట్లలో రోజువారీ ట్రేడింగ్ పరిమాణంలో రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 20-25% ఉంటే, చైనాలో ఇది ఏకంగా 90 శాతంగా ఉంది. ఈ అనిశ్చితి వల్ల సామాన్య ఇన్వెస్టర్లు భయపడి ఒకేసారి అమ్మకాలకు దిగడంతో మార్కెట్ తీవ్ర క్రాష్‌కు గురవుతోంది. ప్రజలు ప్రస్తుతం స్టాక్స్ కంటే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి సురక్షితమైన మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు.