పండుగ పూట సామాన్యుల ఆశలను ఆసరాగా చేసుకుని వారి బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త కుట్రకు తెరలేపారు. భారత ప్రభుత్వం దేశ పౌరులందరికీ దీపావళి కానుకగా రూ.8,000 నగదును ఉచితంగా అందిస్తోందంటూ వాట్సాప్‌లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఓ నకిలీ సందేశంపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజలను హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును దుర్వినియోగం చేస్తూ, అధికారిక ప్రభుత్వ పథకంలా భ్రమింపజేసేలా రూపొందించిన ఈ సందేశం పూర్తిగా మోసపూరితమైనదని బ్యూరో డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్ స్పష్టం చేశారు.సైబర్ నేరగాళ్లు పండుగ వాతావరణాన్ని క్యాష్ చేసుకునేందుకు వాట్సాప్‌లో ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పంపుతున్నారు. అందులో కేంద్ర ప్రభుత్వం భారతీయులందరికీ దీపావళి ఆర్థిక సాయం కింద రూ.8,000 ఇస్తోందని, ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి కింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయాలని ఊరిస్తున్నారు. ఆ లింక్‌ను క్లిక్ చేయగానే అది నకిలీ వెబ్‌సైట్‌కు దారితీస్తుంది. అక్కడ వ్యక్తిగత వివరాలు, ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు, యూపీఐ పిన్ లేదా ఓటీపీలను నమోదు చేయాలని అడుగుతారు. ఒకవేళ ఆ వివరాలు నమోదు చేస్తే క్షణాల్లో బ్యాంకు ఖాతాలోని సొమ్మంతా నేరగాళ్ల జేబుల్లోకి వెళ్లిపోతుంది.
అంతేకాకుండా.. ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల మొబైల్ ఫోన్లలోకి హానికరమైన మాల్వేర్ లేదా వైరస్ చొరబడి ఫోన్ నియంత్రణ సైబర్ ముఠాల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని డైరెక్టర్ వివరించారు.ప్రభుత్వం ఎలాంటి నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టినా అధికారిక పోర్టళ్లు, గుర్తింపు పొందిన వార్తా ఛానెళ్ల ద్వారానే ప్రకటిస్తుందని, ఇలాంటి ప్రైవేట్ వాట్సాప్ లింకుల ద్వారా కాదని శిఖా గోయల్ స్పష్టం చేశారు. ఎవరూ కూడా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను నమ్మవద్దని, ఇతరులకు ఫార్వర్డ్ చేసి వారిని కూడా మోసాల ఊబిలోకి నెట్టవద్దని కోరారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బ్యాంకు ఖాతా వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు, యూపీఐ పిన్‌లను గుర్తుతెలియని వెబ్సైట్లలో నమోదు చేయవద్దని స్పష్టం చేశారు. ఏదైనా లబ్ధి పొందడానికి ఫీజుల రూపంలో డబ్బులు చెల్లించాలని వచ్చే సందేశాలను తిరస్కరించాలని సూచించారు. పొరపాటున ఎవరైనా ఈ లింక్‌పై క్లిక్ చేసి ఉంటే వివరాలను ఎంటర్ చేయకుండా వెంటనే వెబ్సైట్ నుంచి బయటకు రావాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే మోసపోయి ఖాతా నుంచి నగదు డెబిట్ అయినట్లయితే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోల్డెన్ అవర్‌లో జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని అదే సమయంలో తమ బ్యాంకుకు సమాచారం అందించి ఖాతాలు, కార్డులను తాత్కాలికంగా బ్లాక్ చేయించుకోవాలని డైరెక్టర్ సూచించారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...
Next Post