హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం నమోదు..
కేబీఆర్ పార్క్ చుట్టూ భారీ ట్రాఫిక్ జామ్.
ఎట్టకేలకు హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మేఘాలు వర్షంగా మారడంతో భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లాలనుకునేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే 6-7 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ముఖ్యంగా నవంబరు 2 నుంచి 3 తేదీల్లో ఒంగోలు – మచిలీపట్నం తీరాల వైపు దూసుకొస్తున్న వాయుగుండం ప్రభావం వల్ల కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో నవంబర్ 4 వరకు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.కాప్రా, ఘట్కేసర్, కీసర, నాగారం, బోడుప్పల్, అన్నోజిగూడ, దమ్మాయిగూడ, రాంపల్లి, పీర్జాదిగూడ, మేడిపల్లి, చార్లపల్లి ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. పశ్చిమ, దక్షిణ హైదరాబాద్ (నానక్‌రామ్‌గూడ, మణికొండ, షేక్‌పేట్, తోలిచౌకి)లో కురుస్తున్న కుండపోత వర్షం ప్రధాన నగరానికి సైతం విస్తరించింది. ఇప్పుడు తూర్పు, పశ్చిమ, త్తర, దక్షిణ, మధ్య హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీటి కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ భారీ వర్షం…
తుర్కయాంజాల్, మొయినాబాద్, ఇబ్రహీంపట్నం, ఆర్ఎఫ్సి (RFC), అబ్దుల్లాపూర్‌మెట్, శంకరపల్లి, మహేశ్వరం, తుక్కుగూడ, శంషాబాద్, పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షం దంచికొడుతోంది. దక్షిణ హైదరాబాద్ పరిధిలోని హయత్ నగర్ నుంచి నార్సింగి, మణికొండ వరకు రాజేంద్రనగర్, చంద్రాయణగుట్ట, అన్ని పరిసర ప్రాంతాల్లోనూ వర్షంతో ఉష్ణోగ్రతలు దిగొస్తున్నారు. దాదాపు 30 రోజుల తరువాత చినుకులు చూసిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం రద్దీ సమయం కావడంతో ట్రాఫిక్ కష్టాలు రెట్టింపయ్యాయి.
ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో పరిస్థితి తీవ్రంగా మారింది. మాదాపూర్, హైటెక్‌సిటీ, కేపీహెచ్‌బీ, మైండ్‌స్పేస్, ఐకియా మార్గాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. మాదాపూర్ సిటీ వైన్స్ వద్ద ప్రధాన రహదారి చెరువును తలపించడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కుత్బుల్లాపూర్ నుంచి సూరారం వరకు, షాపూర్ నుంచి గాజులరామారం వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షానికి తడుస్తూ కొందరు ప్రయాణికులు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకోగా, మరికొందరు గంటల తరబడి ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయారు.
ఉప్పల్, ఎల్బీనగర్, మణికొండ, రాయదుర్గం, రాజేంద్రనగర్ వంటి నగర శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అయితే, గత కొన్ని రోజులుగా నగరంలో తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది.