ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వణుకు పుట్టిస్తోంది..100-110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం..!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వణుకు పుట్టిస్తోంది. క్రమంగా బలపడుతున్న వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే సూచనలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.

పరిస్థితి తీవ్రతను గుర్తించిన సీఎం చంద్రబాబు నాయుడు తన రేపటి (సోమవారం) ఢిల్లీ పర్యటనను సైతం రద్దు చేసుకున్నారు. అమరావతిలో ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి, తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బాపట్ల దగ్గర తీరం దాటే అవకాశం ..

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. నవంబరు 2 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. నవంబరు 3న ఉదయం బాపట్ల సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నాయి. ఆ సమయంలో గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది..ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన :.

నవంబరు 2 నుంచి ఏపీలో వర్షాలు ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబరు 3, 4 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడవచ్చని అంచనా..

నవంబరు 3న జిల్లా సగటు వర్షపాతం (అంచనా) :

ఏలూరు : 179 మి.మీ.
కృష్ణా : 163 మి.మీ.
ఎన్టీఆర్ : 161 మి.మీ.
పశ్చిమ గోదావరి : 147 మి.మీ.
గుంటూరు : 119 మి.మీ.
బాపట్ల : 104 మి.మీ.
మరోవైపు అత్యంత భారీ వర్ష సూచన ఉన్న 20 మండలాల్లో ఏలూరులో 9, కృష్ణాలో 5, ఎన్టీఆర్‌లో 5, బాపట్లలో ఒక మండలం ఉన్నాయి.

బుడమేరుకు వరద ముప్పు.. విద్యుత్ శాఖకు టెన్షన్ .

భారీ వర్షాలతో నవంబరు 3న బుడమేరుకు సుమారు 32,500 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఎర్రకాల్వ, గోనెలవాగు, జల్లేరు, పంపా ప్రాంతాల్లోనూ వరద ముప్పు పొంచి ఉంది. రిజర్వాయర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని సీఎం ఆదేశించారు.