పాకిస్థాన్ సైన్యానికి సవాళ్లు విసురుతూ,
వరుస దాడులతో ఆ దేశ భద్రతా వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది..ఆ సంస్థకు ఎనిమిదేళ్లపాటు నాయకత్వం వహించిన బషీర్ జెబ్‌ను కమాండర్ ఇన్ చీఫ్ పదవి నుంచి తొలగించారు. పాకిస్థాన్ సైన్యం, భద్రతా బలగాలు, చైనా ప్రయోజనాలే లక్ష్యంగా పలు దాడులకు బాధ్యత వహించిన ఈ తిరుగుబాటు సంస్థలో ఇప్పుడు నాయకత్వ మార్పు సంచలనం రేపుతోంది.
BLA Commander Bashir Zeb
అసలు బషీర్ జెబ్‌ను ఎందుకు తొలగించారు? సంస్థలో అంతర్గత విభేదాలే కారణమా? భారీ సైనిక ఆపరేషన్ వైఫల్యం ఆయన పదవికి ఎసరు పెట్టిందా? మహిళలను ఆత్మాహుతి దాడులకు ఉపయోగించిన వ్యూహంపై వచ్చిన విమర్శలు ప్రభావం చూపాయా? లేక ఆయన విషప్రయోగానికి గురయ్యారా? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు.. బషీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
బీఎల్‌ఏ అధికార ప్రతినిధి జీయంద్ బలూచ్ నవంబర్ 3న విడుదల చేసిన ప్రకటనలో బషీర్ జెబ్ ఇకపై కమాండర్ ఇన్ చీఫ్‌గా కొనసాగరని వెల్లడించారు. ఆయన చేతిలో ఉన్న పరిపాలనా, సైనిక, విధానపరమైన అధికారాలన్నీ తదుపరి నాయకుడి నియామకం జరిగే వరకు సంస్థ సీనియర్ కమాండ్ కౌన్సిల్‌కు బదిలీ చేసినట్లు ప్రకటించారు. అక్టోబర్ 16న జరిగిన సంస్థ అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బలూచిస్థాన్ పోస్టు కథనం వెల్లడించింది. 2018లో సంస్థ పునర్వ్యవస్థీకరణ సమయంలో రూపొందించిన నిబంధనల ప్రకారమే నాయకత్వ మార్పు జరిగిందని BLA ప్రకటించింది. ఎంతటి కీలక నాయకుడైనా జీవితాంతం కమాండర్ ఇన్ చీఫ్‌గా కొనసాగడానికి వీల్లేదని సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. ఈ మార్పు ఎలాంటి అంతర్గత విభేదాలు, విచ్ఛిన్నం, ఘర్షణలు లేకుండానే జరిగిందని కూడా స్పష్టం చేసింది. అయితే బషీర్ జెబ్‌ను తొలగించడానికి అసలు కారణం ఏమిటన్నది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు? స్వేచ్ఛగా ఉన్నారా? నిర్బంధంలో ఉన్నారా? అనారోగ్యానికి గురయ్యారా? అన్న విషయాలపైనా స్పష్టత లేదు.
పాకిస్తాన్ కథనాలు ఇలా…!
ధృవీకరించబడిన నిఘా నివేదికల ప్రకారం, నిషేధిత ఉగ్రవాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) అగ్ర కమాండర్ బషీర్ జెబ్‌పై ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌లో అతని సన్నిహితుడు విషప్రయోగం చేయడంతో ఆ సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం అతడిని వైద్య చికిత్స, ఆశ్రయం కోసం భారతదేశానికి తరలించారు…ఈ హత్యాయత్నం, ప్రత్యర్థి వర్గాలైన రహ్మాన్ గుల్ గ్రూపు పన్నాగం పన్నిన అంతర్గత కుట్రా లేక బాహ్య గూఢచార సంస్థల లోతైన చొరబాటు ఫలితమా అనేది ఇంకా నిర్ధారణ కానప్పటికీ, ఈ సంఘటన బీఎల్‌ఏలో నెలకొన్న తీవ్రమైన నాయకత్వ సంక్షోభాన్ని స్పష్టం చేస్తోంది. జెబ్‌ను భారతదేశానికి తరలించడం, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద గ్రూపులకు బాహ్య ప్రభుత్వాలు అందిస్తున్న అండను మరోసారి బట్టబయలు చేసిందని భద్రతా విశ్లేషకులు పేర్కొంటున్నారు.