కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో HCU తరహాలో ప్రకృతి విధ్వంసం…
కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మట్టి తవ్వుతూ అక్రమంగా చెట్ల నరికివేత.
పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని, వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు ఉందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థులు.
కలెక్టర్ ఆదేశాల మేరకు యూనివర్సిటీని సందర్శించి, అనుమతి లేకుండా చెట్లను నరికివేశారని నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు.
అభివృద్ధి పనుల పేరిట అన్యాయంగా చెట్లు నరికి, మట్టిని బయటికి అక్రమంగా తరలిస్తూ, వన్యప్రాణులకు హాని కలిగిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని పీసీబీకి ఫిర్యాదు చేసిన విద్యార్థులు.
శాతవాహన విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో అభివృద్ధి పనుల పేరుతో జరుగుతున్న భారీ తవ్వకాలు, మట్టి తరలింపు, ఎన్నో ఏళ్ల నాటి చెట్ల నరికివేత మరియు పర్యావరణ విధ్వంసంపై విశ్వవిద్యాలయ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు…గాలరీ, లా కళాశాల, సింథటిక్ ట్రాక్ వంటి అభివృద్ధి పనుల పేరుతో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో భారీగా తవ్వకాలు చేపట్టి, విలువైన మట్టిని బయటకు తరలిస్తున్నారని, అదే సమయంలో పెద్ద పెద్ద వృక్షాలను నరికివేస్తున్నారని విద్యార్థులు పేర్కొన్నారు…ఈ చర్యల వల్ల క్యాంపస్‌లో దుమ్ము, శబ్ద కాలుష్యంతో పాటు సహజ పర్యావరణం, జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జాతీయ పక్షి నెమళ్లతో పాటు అనేక రకాల పక్షులు, వన్యప్రాణులు తరచుగా కనిపించేవని, ప్రస్తుతం వాటి సహజ ఆవాసాలు ధ్వంసం కావడంతో వాటి ఉనికి గణనీయంగా తగ్గిపోయిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TSPCB) అధికారులకు అధికారికంగా ఫిర్యాదు అందజేశారు. విశ్వవిద్యాలయ క్యాంపస్‌ను సందర్శించి తవ్వకాల వల్ల కలుగుతున్న పర్యావరణ నష్టాన్ని, దుమ్ము మరియు శబ్ద కాలుష్యాన్ని పరిశీలించాలని కోరారు. సంబంధిత అనుమతులు, పర్యావరణ నిబంధనల అమలును తనిఖీ చేసి, ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధి పేరిట భారీ ఎత్తున తవ్వకాలు, పాత చెట్లను నరికివేయడం వల్ల శాతవాహన విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని నెమళ్లు, ఇతర వన్యప్రాణులు తమ సహజ ఆవాసాలను కోల్పోతున్నాయని విశ్వవిద్యాలయ జాయింట్ యాక్షన్ కమిటీ (ఎస్‌యూ జేఏసీ) చైర్మన్ కరికే మహేష్ ఆరోపించారు.
దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో 10 అడుగులకు పైగా లోతుగా జరిపిన తవ్వకాల వల్ల క్యాంపస్‌లోని పచ్చదనం, ప్రకృతి దృశ్యం దెబ్బతిన్నాయని మహేష్ అన్నారు. ఈ పనుల వల్ల ఏర్పడిన గుంతల కారణంగా పక్షులు, జంతువులు కూడా ప్రమాదంలో పడొచ్చని ఆయన ఆరోపించారు.
అక్రమ తవ్వకాలు, మట్టి తొలగింపు, చెట్ల నరికివేతపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ, ఈ కార్యకలాపాలు క్యాంపస్ జీవవైవిధ్యానికి హాని కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. కలెక్టర్, అటవీ అధికారులు ఆ స్థలాన్ని తనిఖీ చేయాలని, నీరు, భూమి, చెట్ల (వాల్టా) చట్టం, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.