విద్యా సంస్థల్లో సినిమా కార్యక్రమాలపై నిషేధం…
త్వరలో ప్రత్యేక చట్టం రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
విద్యా, క్రీడా కార్యక్రమాలు నిర్వహించాల్సిన విద్యాసంస్థల ప్రాంగణాల్లో సినిమా, వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై నిషేధం విధించే ఆలోచనలో ప్రభుత్వం
ఇటీవల పలు కాలేజీల్లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు, దాండియా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు గాయాలవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం
విద్యాసంస్థల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే అంశంపై నివేదిక తయారు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించిన ప్రభుత్వం….
విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన విద్యాసంస్థలు కట్టుతప్పుతున్నాయి. భవిష్యత్ బాగుండాలని రూ.లక్షలు పోసి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివిస్తున్నారు. కానీ కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులను తమ రాజకీయ, కుటుంబ అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి. ఈ క్రమంలో అనేక అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవడమే కాకుండా కొన్నిసార్లు విద్యార్థులు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. కొన్ని విద్యాసంస్థల్లో చోటుచేసుకున్న పరిణామాలు ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు, విద్యావంతుల్లో ఆందోళన కలిగించాయి. విద్యాసంస్థల యాజమాన్యాలు ఇష్టారీతిగా సెలవులు ప్రకటించడం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే భారీ కార్యక్రమాలు చేపట్టడం పరిపాటిగా మారింది…ఈ నేపథ్యంలో విద్యాసంస్థల్లో సినిమా, ఇతర ప్రైవేటు కార్యక్రమాల ప్రచారంపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. విద్యాసంస్థలు చట్టపరంగా వారి క్యాంప్‌సలలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు? ఎటువంటివి నిర్వహించకూడదనే అంశంపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ఇటివలే ప్రభుత్వం విద్యాశాఖాధికారులను ఆదేశించింది. ఈ దిశగా మార్గదర్శకాలు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాలను విద్య, క్రీడా కార్యక్రమాలకు మినహా సినిమా, ఇతర వాణిజ్య కార్యక్రమాలకు వినియోగించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొననున్నారు. విద్య, క్రీడా కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహిలనుకుంటే.. ఎంత మంది హాజరవుతారు? స్టేజీ నిర్మాణం, రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు, తదితర వివరాలను ముందుగానే స్థానిక విద్యాశాఖ అధికారులు పోలీసులు, అగ్నిమాపక శాఖలకు అందజేయాలి. క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు వందలాది మందితో నిర్వహించే వాటి విషయంలో మాత్రం విద్యాసంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి. లేనిపక్షంలో భారీ జరిమానాలతో పాటు ఇతర చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేయనున్నారు…..ఈ కొత్త నిబంధనల ప్రకారం.. క్యాంపస్‌లను కేవలం విద్య, క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలి. సినిమా ప్రమోషన్లు, ఇతర వాణిజ్య కార్యక్రమాలను పూర్తిగా నిషేధించనున్నారు. ఒకవేళ పెద్ద ఎత్తున క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే, హాజరయ్యే వారి సంఖ్య, భద్రతా ఏర్పాట్ల గురించి ముందుగానే పోలీసు, అగ్నిమాపక శాఖలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించే విద్యాసంస్థల యాజమాన్యాలపై భారీ జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకోనున్నారు.
కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల భద్రతను విస్మరించి, వాణిజ్య ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ సైతం విద్యార్థుల భద్రతపై ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించారు. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి…