ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. ఇప్పటికే అక్కడక్కడ వర్షాలు కురుస్తుండగా.. రానున్న రెండు రోజుల్లో కూడా భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా 14 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది..నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉండటమే కాకుండా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు..
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణా రాష్ట్రంలో కూడా వాతావరణం మారే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు తూర్పు గాలుల ద్రోణి విస్తరించడం, అలాగే కొమొరిన్ ప్రాంతం నుంచి రాయలసీమ వైపు మరో ద్రోణి కొనసాగడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణాకు వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది..