రాళ్లు, కర్రలతో దాడి.. బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం..!.

కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ (priyanka gandhi) పై ఢిల్లీ బీజేపీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్‌ బిదురి చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది…రమేష్‌ బిదురి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కేంద్ర మంత్రులను అడ్డుకోవాలని యూత్‌ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ (congress party) కార్యకర్తలు హైదరాబాద్‌ నాంపల్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారు. రమేష్‌ బిదూరి దిష్టిబొమ్మను దహనం చేశారు.

కాంగ్రెస్‌ కార్యకర్తలు చేసిన దాడిలో ఓ బీజేపీ (bjp) కార్యకర్త తలకు తీవ్ర గాయమైంది. దీంతో కోపోద్రికులైన బీజేపీ కార్యకర్తలు.. కాంగ్రెస్ కార్యకర్తలపై కర్రలతో దాడులు చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.

దాడులపై సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్‌ బిదూరి ప్రియాంక గాంధీని ఉద్దేశిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం ఎందుకు నేతలు ఎందుకు చర్యలు తీసుకోలేదని యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిరసన చేసేందుకు వచ్చిన తమపై బీజేపీ కార్యకర్తలు కర్రలతో దాడులు చేశారని ఆరోపిస్తున్నారు.

కాగా, రమేష్‌ బిధూరి (Ramesh Bidhuri) ప్రియాంక గాంధీపై నోటి దురుసు వ్యాఖ్యలు చేశారు. తనని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేస్తానో ఉదహరిస్తూ ఆమె పేరు ప్రస్తావించారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రియాంకా గాంధీ బుగ్గల వంటి సుతిమెత్తని రోడ్లు నిర్మిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. రమేష్‌ బిదురితో పాటు బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో తాను ప్రియాంక గాంధీ గురించి అలా మాట్లాడాల్సింది కాదంటూ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఆ వివాదం కొనసాగుతుంది.

బిజేపీ రాష్ట్ర కార్యాలయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం..!.

బిజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడి చేయడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. 10 మంది కార్యకర్తలొచ్చి దాడులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోబోదు..బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే… గాంధీ భవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా మిగలవు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అని ప్రశ్నించారు.

రాళ్ల దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించాలనుకుంటోందా..
పిల్లలు, వ్రుద్దులకు రాళ్ల తగిలితే పరిస్థితి ఏ విధంగా ఉండేదా తెలియదా అని అడిగారు. అలాగే బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దు. తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందే. చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందే. అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భయపెట్టాలని చూస్తూ ఊరుకునేది లేదు. కాబట్టి తక్షణమే ఈ దాడికి పాల్పడ్డ కార్యకర్తలను అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేసారు బండి సంజయ్..