తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై ఘ‌న విజ‌యం…భార‌త్‌ బోణీ అదుర్స్..!

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్ శుభారంభం చేసింది. దుబాయ్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. శుభ్‌మ‌న్ గిల్ (101 నాటౌట్‌; 129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో 229 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 46.3 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ (41; 36 బంతుల్లో 7 ఫోర్లు), కేఎల్ రాహుల్ (41 నాటౌట్; 47 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు) రాణించారు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో రిషద్ హొస్సేన్ రెండు వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్‌లు చెరో వికెట్ సాధించారు..భార‌త్‌కు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్‌లు శుభారంభం అందించారు. ఆరంభంలో ఆచి తూచి ఆడిన హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ క్ర‌మంగా జోరు అందుకున్నాడు. బౌండ‌రీతో హోరెత్తించాడు. హాఫ్ సెంచ‌రీకి చేరువైన అత‌డు త‌స్కిన్ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌కు య‌త్నించి రిషద్ హొస్సేన్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. తొలి వికెట్‌కు రోహిత్, గిల్ జోడి 69 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు..

రోహిత్‌ 11,000 పరుగులు.

వన్డేల్లో రోహిత్‌ 11,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ రికార్డు అందుకున్న నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఘనత అందుకున్న పదో బ్యాటర్‌. 270 మ్యాచ్‌లు, 261వ ఇన్నింగ్స్‌లో రోహిత్‌ 11 వేల మార్క్‌ను దాటాడు. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 222 ఇన్నింగ్స్‌లతో విరాట్‌ కోహ్లీ మాత్రమే అతడి కంటే ముందున్నాడు.
India vs Bangladesh, Champions Trophy 2025.

రోహిత్ భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గంగూలీ (11,363 పరుగులు)కి సమీపంలో ఉన్నాడు. అతడికి అధిగమిస్తే మూడో స్థానానికి చేరుతాడు. అదే విధంగా రోహిత్‌ వన్డేల్లో అత్యధిక సిక్సులు బాదిన జాబితాలో రెండో స్థానంలో (338 సిక్సులు) ఉన్నాడు. టాప్‌ ప్లేస్‌లో ఉన్న పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది (351)ని త్వరలో అధిగమించే అవకాశం ఉంది…

వన్డేల్లో 200 వికెట్లు సాధించిన షమీ.

బంగ్లాపై షమీ (5/53)తో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఒక ప్రత్యేక మైలురాయిని చేరుకున్నాడు. వేగంగా 200 వన్డే వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్‌ చేశాడు. మొత్తంగా ఈ ఫీట్‌ సాధించిన రెండో వేగవంతమైన బౌలర్‌గా నిలిచాడు. కేవలం 104వ మ్యాచుల్లో ఈ ఘనతను సాధించాడు. 133 మ్యాచుల్లో ఈ రికార్డు అందుకున్న భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌ను అధిగమించాడు. ఓవరాల్‌గా మిచెల్ స్టార్క్ (102) షమీ కంటే ముందున్నాడు. ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్‌ చేశాడు. తన ఖాతాలో 60 వికెట్లు వేసుకున్నాడు. అతడి తర్వాత జహీర్ ఖాన్ (59), జవగల్ శ్రీనాథ్ (47) ఉన్నారు.