తెలంగాణ వ్యాప్తంగా మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైనే…!.ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ..!

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని ఐఎండీ అధికారి ధర్మరాజు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు…ఆ జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం : ఆదిలాబాద్‌, కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలను జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున మరో 7 జిల్లాల్లోనూ శనివారం నుంచి ఎల్లో హెచ్చరికలు అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది..
రానున్న రోజుల్లో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. రానున్న రోజుల్లో క్రమేపీ ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని వివరించింది. ప్రస్తుతం నమోదవుతున్న గణాంకాలను పరిశీలిస్తే వేసవి కాలం కాస్త ముందుగానే వచ్చినట్లుగా తెలుస్తోందని ధర్మరాజు తెలిపారు. ఇవాళ నాలుగు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేసినట్లుగా ఆయన వివరించారు.

గత రెండు రోజులుగా ఉత్తర తెలంగాణ భాగంలో క్రమేపీ వేడి వాతావరణం నమోదవుతున్నట్లుగా వాతావరణశాఖ తెలిపింది. ఫిబ్రవరి నెల నుంచి సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీల అధికంగా ఉందని వివరించింది. హైదరాబాద్తో పాటు నగర పరిసర ప్రాంతాల్లో గణనీయంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 38 నుంచి 39 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వివరించింది..