మార్పు అంటే రైతులకు కన్నీళ్లే మిగిలాయని, అసలు వారికి ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు… కేసీఆర్…

మార్పు అంటే రైతులకు కన్నీళ్లే మిగిలాయని, అసలు వారికి ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాతికేళ్ల సభ నిర్వహణా బాధ్యతలు అప్పగించినందుకు అధినేతకు ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమ సమయంలో విశ్వరూప సభ స్ఫూర్తితో రజతోత్సవ సభను విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న రజతోత్సవ మహాసభకు సంబంధించి వరంగల్ ముఖ్య నేతలు ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సభా నిర్వహణకు సంబంధించి అధినేత నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అధినేత ఆదేశాలతో వరంగల్లో సభా నిర్వహణ పార్టీకి కలిసొచ్చే అంశమని ఆనందం వ్యక్తం చేశారు. మహాసభ నిర్వహణ కోసం ఎల్కతుర్తి వద్ద 1213 ఎకరాల స్థలాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. 154 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉంటుందని, పార్కింగ్ కోసం 1059 ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు. దాదాపు 50వేల వాహనాలు పార్కింగ్ చేసుకునే వీలుంటుందన్నారు.

10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లు : రజతోత్సవ సందర్భాన కనీవినీ ఎరుగని రీతిలో మహసభను నిర్వహించనున్నట్లు నేతలు వివరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు, తెలంగాణ వాదులు, ప్రజలు భారీ ఎత్తున తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిరకాల చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. పది లక్షల చొప్పున మజ్జిగ ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లను సిద్ధంగా ఉంచనున్నట్లు చెప్పారు. 1500 మంది వాలంటీర్లు, అత్యవసర వైద్యసేవలు, అంబులెన్సులు అందుబాటులో ఉంచనున్నట్లు నేతలు వెల్లడించారు.

కేసీఆర్ శ్రీరామరక్ష : ఉద్యమ సమయంలో నిర్వహించిన విశ్వరూప మహాసభ స్ఫూర్తితో రజతోత్సవ మహాసభను విజయవంతం చేసుకుంటామని ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఓరుగల్లు ముద్దుబిడ్డలు మహాకవి కాళోజీ నారాయణరావు, ఆచార్య జయశంకర్ అందించిన ఉద్యమ స్ఫూర్తితో పార్టీ, ప్రజల కోసం తమ కార్యాచరణను అమలు చేస్తామని అన్నారు. తెలంగాణకైనా, వరంగల్కైనా కేసీఆర్ శ్రీరామరక్ష అన్న విషయం మరోమారు నిరూపితమైందని నేతలు అన్నారు. పదేళ్ల పాలనలో వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు.