అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేరు లేకుండా కమిటీ...
సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించినా హైకోర్ట్..
HCU భూవివాదంపై మరోసారి దూకుడు ప్రదర్శిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్..
HCU భూవివాదంపై మంత్రులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం…ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ క్రమంలోనే HCU భూవివాదంపై మంత్రులతో కమిటీ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కమిటీలో అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేరు లేకుండానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, HCU కార్యనిర్వాహక కమిటీ, పౌర సంఘాలు, HCU విద్యార్థులు, స్టేక్ హోల్డర్స్ తో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, HCU కార్యనిర్వాహక కమిటీ, పౌర సంఘాలు, HCU విద్యార్థులు మరియు స్టేక్ హోల్డర్స్ తో కమిటీ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం..
ఏపీలో ఒకవైపు ఎండలు.. మరోవైపు వానలు.
. కోస్తాలో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం.. నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు, వ్యాపార కూడళ్లు.. రాయలసీమ, దక్షిణ కోస్తాకు మోస్తారు నుంచి భారీ వర్ష సూచన.. అన్నమయ్య, సత్యసాయి, కర్నూల్ జిల్లాలలో భారీ వర్షాలకు అవకాశం.. ఉత్తరాంధ్రలో అల్లూరి, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు- విశాఖ వాతావరణ కేంద్రం
హైదరాబాద్ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్..
దాఖలు చేసిన బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు.. బీజేపీ తరుపున నామినేషన్ వేసిన చేసిన గౌతం రావు.. ఎంఐఎం తరుపున నామినేషన్ దాఖలు చేసిన మీర్జా రియాజ్ ఉల్ హసన్.. ఎన్నికలకు దూరంగా కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఈ నెల 23న పోలింగ్.. 25న కౌంటింగ్.. ఫలితాల ప్రకటన..
‘చేనేత’ ఉసురు తీయొద్దు
భూధాన్ పోచంపల్లిలో చేనేత మగ్గాలను సందర్శించిన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్..
చేనేత కార్మికులకు చేయూత నిచ్చిచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేయడం వల్ల చేనేత కార్మికులు బతకలేని స్థితి దాపురించిందని రాష్ట్ర మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేసి వారికి మరింత మేలు చేయాలి గాని, ఉన్న స్కాంలను రద్దు చేసి చేనేత కార్మికుల ఉసురు తీయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల మాదిరిగానే రెండు లక్షల రుణ మాఫీ వెంటనే అమలు చేయాలని కోరారు.
శుక్రవారం రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ తో కలిసి భూదాన్ పోచంపల్లి పట్టణంలో పలు చేనేత కార్మికుల గృహాలను సందర్శించి, మగ్గాల పనితీరును, చేనేత కార్మికుల స్థితిగతులను వారితో అడిగి తెలుసుకున్నాడు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సంక్షేభంలో కొరకు పోతున్న చేనేతను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో కులవృత్తులను పూర్తిగా నిర్వీర్యం పరుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు
నూతన ప్రభుత్వం వచ్చాక మత్స్యకారులకు అందించాల్సిన చాప పిల్లలు అందించకపోవడంతో వారికి అదనపు భారం పడి పూర్తిస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వంలో చేనేత కార్మికులకు నూలుపై అందించే సబ్సిడీని పూర్తిగా తొలగించడం సరికాదని ఆయన అన్నారు.
గీత కార్మికులకు ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఇంతవరకు అమలు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ కుల వృత్తులపై చూపుతుంది చిన్నచూపుని ఆయన విమర్శించారు
చేనేత కార్మికుల పూర్తిస్థాయిలో ఆదుకోవడంతోపాటు నేతన్న పొదుపు పథకాన్ని వెంటనే ప్రారంభించి వారికి ప్రోత్సాహకాలు అందించే విధంగా చేనేత వస్త్రాల కొనుగోలు టెస్కో ద్వారా చేపట్టి వారికి మార్కెట్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు..
పాన్ కార్డు హోల్డర్లకు అలర్ట్..
*పాన్ కార్డు హోల్డర్లకు కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది.ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌ను ఉపయోగించి పాన్ కార్డు తీసుకున్నవారు తమ కార్డును ఆధార్ నంబర్‌తో లింక్ చేసుకోవాలని కేంద్రం తెలిపింది. ఇందుకోసం 2025 డిసెంబర్ 31 ను గడువుగా నిర్దేశించింది. ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 అక్టోబర్ 1, అంతకంటే ముందు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని ఇచ్చి పాన్ పొందిన వారు లింకింగ్ చేసుకోవాలి..
*వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు*
*దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించింది*
*సామాజిక-ఆర్థిక న్యాయం, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి కోసం సమిష్టి అన్వేషణలో ఒక కీలకమైన ఘట్టం*
పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోడీ స్పందించారు. సామాజిక మాద్యమం వేదికగా స్పందిస్తూ.. ఇది కీలక పరిణామం అని పేర్కొన్నారు.
దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని పేర్కొన్నారు. తాజాగా బిల్లు ఆమోదంతో అట్టడుగున ఉన్న వర్గాలకు మేలు చేకూరుతుందని తెలిపారు. అంతేకాకుండా వారి గళం వినిపించే అవకాశం దక్కుతుందని చెప్పుకొచ్చారు.
పార్లమెంట్ ఉభయ సభలు వక్ఫ్ (సవరణ) బిల్లు మరియు ముస్సల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లును ఆమోదించడం కీలక పరిణామం. సామాజిక-ఆర్థిక న్యాయం, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి కోసం సమిష్టి అన్వేషణలో ఒక కీలకమైన ఘట్టం. ముఖ్యంగా చాలా కాలంగా అట్టడుగున ఉన్న ప్రజలకు ఎంతగానో సహాయపడుతుంది అని మోడీ ట్వీట్ చేశారు.
12 గంటల పాటు చర్చ తర్వాత శుక్రవారం అర్ధరాత్రి దాటిన అనంతరం రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు లోపాలు ఎత్తిచూపాయి. మొత్తానికి ఉభయ సభల్లో సులువుగానే బిల్లు ఆమోదం పొందడం విశేషం. ఇక ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరకు వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే.. చట్టం అమల్లోకి రానుంది.
వక్ఫ్ బిల్లుపై బుధవారం లోక్‌సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. అనంతరం స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు.
ఇక ఈ బిల్లు ముస్లింల ప్రయోజనాలకు హాని కలిగిస్తుందనే ఆరోపణలను మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. ఈ బిల్లుతో ముస్లింలకే లాభమని.. బిల్లు ఆమోదంతో ముస్లిమేతరులు ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేరని పేర్కొన్నారు. అయినా ఈ బిల్లు మతానికి సంబంధించింది కాదని.. ఆస్తి, దాని నిర్వహణకు, అవినీతిని నిర్మూలించడమే ఈ బిల్లు లక్ష్యమని తెలిపారు..
*పదరా మండలంలో విషాదం*
అకాల వర్షానికి పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి ఒక మహిళకు తీవ్ర గాయాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం లోని వ్యవసాయ పొలంలో వేరుశెనగ పంట కూలీ పనులు చేస్తుండగా పిడుగు పడి కోడోనిపల్లి పల్లి గ్రామానికి చెందిన సుంకరి సైదమ్మ (35) ఈధమ్మ (55) ఇద్దరు మహిళలు మృతి మరో మహిళ సుంకరి లక్ష్మమ్మ కు తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు..
*పిడుగులతో కూడిన భారీ వర్షాలు*
రాష్ట్రంలో 3 రోజులపాటు విభిన్న వాతావరణం కొనసాగుతుందని APSDMA వెల్లడించింది..
*ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి కాకినాడలో మోస్తరు వానలు, సోమవారం అల్లూరి, కాకినాడ, తూ.గో, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంది. మిగతా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది..
*తెలంగాణలో మళ్లీ కలవరపెడుతున్న బర్డ్ ఫ్లూ*
తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతా ల్లో బర్డ్ ప్లూ బారినపడి వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ మండలంలోనూ బర్డ్ ఫ్లూ కలకలం చోటు చేసుకుంది. ఓ ఫౌల్ట్రీ ఫామ్ లో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డా యి.గత నాలుగు రోజుల క్రితం నగర శివారులోని ఓ ఫౌల్ట్రీలో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి.
అధికారులు చనిపోయిన కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. బర్డ్ ఫ్లూ అని అధికారులు నివేదిక ఇవ్వడంతో పౌల్ట్రీ ఫామ్ యాజమానులు ఆందోళన చెందుతున్నారు. కోట్లలో ఆస్తి నష్టం సంభవిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, మరోసారి అదే ప్రాంతంలోని ఫౌల్ట్రీ ఫామ్ లలో అధికారులు మరోసారి శాంపిల్స్ ను సేకరించారు. కోళ్లు కానీ, కోడిగుడ్లను కానీ అమ్మొద్దని పౌల్ట్రీ యాజ మానులను అధికారులు ఆదేశించారు.
హైదరాబాద్ లోని అధిక శాతం చికెన్ దుకాణాలకు కోళ్లు, కోడి గుడ్లు నగర శివార్లలోని, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఫౌల్ట్రీ ఫామ్ ల నుంచి సరఫరా అవుతుంటాయి. ప్రస్తుతం నగర శివార్లలోని ఫౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేగడంతోపాటు..
పలు ఫామ్ లలోని కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగానే మరణించినట్లు నిర్ధారణ కావడంతో నగరంలోని చికెన్ ప్రియులు భయాం దోళన చెందుతున్నారు.
ఏపీలో నామినేటెడ్ పదవుల ప్రకటన..
38 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల ప్రకటన. 38 ఏఏంసీ చైర్మన్ల పదవుల్లో టీడీపీకి 31, జనసేనకు 6, బీజేపీకి 1.. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్ల పోస్టుల భర్తీ..
-
తెలంగాణ గ్రూప్ 1 నియామకాలకు తొలగిన అడ్డంకి – పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ గ్రూప్-1 అభ్యర్థులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టి వేసింది. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం జీవో 29ని జారీ చేసింది.
దీనిని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. తాజాగా పిటిషన్ కొట్టివేతతో గ్రూప్-1 నియామకాలకు అడ్డంకి తొలగినట్లు అయింది. ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన చేయనుంది.
గ్రూప్-1 జీఆర్ఎల్ జాబితా విడుదల : మార్చి 30న విడుదల చేసిన గ్రూప్-1 జీఆర్ఎల్ జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్లో తమ ర్యాంకులను చూసుకోవచ్చు. మార్చి 10న గ్రూప్-1 ప్రొవిజినల్ మార్కులు విడుదల చేసిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబరులో ఈ గ్రూప్ పరీక్షల జరిగిన విషయం విధితమే.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో మహిళలు టాప్ 10లో ఆరుగురు ఉన్నారు. 550 మార్కులతో తొలి స్థానంతో పాటు మొదటి పది ర్యాంకులు సాధించారు. మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు పరీక్షలు జరగ్గా, అర్హత సాధించిన 12,622 మంది ర్యాంకులను టీజీపీఎస్సీ మార్చి 30న విడుదల చేసింది..
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్‌పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి.. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్‌పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. హెచ్‌సీయూ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకు విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్‌పై అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు..నేడు నల్లగొండ జిల్లా, మర్తినేని గూడెం మాజీ సర్పంచ్ బండమీది రామును అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఇలా ఎంతమందిపై కేసులు పెట్టుకుంటూ వెళ్తారు రేవంత్ రెడ్డి గారు? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదేం ఇందిరమ్మ రాజ్యం? అని హరీశ్‌రావు నిలదీశారు.
అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని మరోసారి స్పష్టం చేస్తున్నాం. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, వృద్ధులకు, దివ్యాంగులకు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను అమలు చేయించేదాకా బిఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు. ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం. ప్రజాక్షేత్రంలో మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు..
కేటీఆర్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనొద్దని..ఎవరైనా కొంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఆ భూములను వాపస్ తీసుకుంటామన్నారు కేటీఆర్.
అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమ్మిన ప్రభుత్వ భూముల వివరాలను వెలికి తేసే పనిలో రేవంత్ సర్కార్ పడింది. గత ప్రభుత్వం ఎవరెవరికి భూములు అమ్మకం.. ఆ భూములను కొన్నవారెవరనే దానిపై ఆరా తీస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నుంచి భూములు కొనుగోలు చేసిన వారికి నోటీసులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది..
తమిళనాడులో ఎలా అడుగుపెడతావో చూస్తాం-రాజ్యసభలో నిర్మలాసీతారామన్ కు వార్నింగ్..!
వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణ బిల్లు చర్చలో ఎంపీల మధ్య వాడీవేడీ సంవాదాలు సాగాయి. ఇందులో వక్ఫ్ బిల్లుకు మద్దతుగా పలువురు కేంద్రమంత్రులు రాజ్యసభలో మాట్లాడారు…అలాగే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్ష ఎంపీలు ఘాటుగా స్పందించారు. ఇదే క్రమంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు ఎంపీల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతలకు కారణమైంది.
తమిళనాడుకు చెందిన ఎండీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి వైగో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అంతకు ముందు చేసిన ప్రసంగంలో వక్ఫ్ బిల్లుకు మద్దతుగా చేసిన వ్యాఖ్యలపై వైగో మండిపడ్డారు.ఈ క్రమంలోనే ఆయన వక్ఫ్ బిల్లుకు మద్దతిచ్చి తమిళనాడులో ఎలా అడుగు పెడతారో చూస్తామంటూ నిర్మలా సీతారామన్ ను తీవ్రస్ధాయిలో హెచ్చరించారు. దీంతో సభలో ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది.
దీనిపై వెంటనే నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. తమిళనాడులో ఎలా అడుగుపెడతారంటూ నన్నే హెచ్చరిస్తారా అంటూ ఎండీఎంకే ఎంపీ వైగోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్నింగ్ లు తనను అడ్డుకోలేవంటూ కౌంటర్ ఇచ్చారు. వైగో చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, వాటిని సభా రికార్డుల నుంచి తొలగించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ ను నిర్మల కోరారు. అయితే ధన్ కర్ మాత్రం వక్ఫ్ బిల్లుపై ఆయన మీ నుంచి హామీ కోరుతున్నారని ఆమెకు నచ్చజెప్పారు. దీంతో నిర్మలా సీతారామన్ కాసేపటికి శాంతించారు..