మందుబాబులకు ఒక్కరోజు చుక్క లేకపోయినా ఏదో కోల్పోయినట్లే అనిపిస్తుంది. ఉదయం అంతా పనిచేసినా, రాత్రికి ఒక్క పెగ్గు తాగందే నిద్రపోరు. ఇక పండగల సమయంలో ఈ జోరు మరింత ఉంటుంది. తాజాగా మద్యం లవర్స్కు నగర పోలీసులు షాక్ ఇచ్చారు. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసేయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంతకీ మద్యం షాపులు ఎప్పుడు బంద్ కానున్నాయి? మళ్లీ తిరిగి ఎప్పుడు ఓపెన్ అవుతాయి? కారణం ఏంటి తదితర వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తోంది. ఇక ఆషాఢం అంటే భాగ్యనగరంలో బోనాల సందడి మామూలుగా ఉండదు. ప్రతి ఆదివారం జంట నగరాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకుంటారు. ఇక శివసత్తుల పూనకాలు, పోతురాజుల నృత్యాలు ఇలా ఒక్కటేమిటి నెలరోజుల పాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు రెండు రోజుల పాటు జరుగుతాయి. ఓరోజు బోనాల జాతర జరగగా, మరోరోజు రంగం కార్యక్రమం జరుగుతుంది. ఈ రెండు రోజులు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలోనే బోనాల ఉత్సవాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సమాజంలో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ సందర్భంగా రెండు రోజుల పాటు మద్యం షాపులు మూసేయ్యాలంటూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
డేట్ ఎప్పుడు: మహంకాళి బోనాలను పురస్కరించుకుని జులై 13, 14న వైన్ షాప్లు బంద్ చేయాలని ఆదేశించారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో జులై 13వ తేదీ ఆదివారం ఉదయం 6 నుంచి 15వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు మద్యం షాపులు మూసేయ్యాలని సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ సెంట్రల్, ఈస్ట్, నార్త్ జోన్ల పరిధిలోని గాంధీనగర్, లాలాగూడ, చిలకలగూడ, బేగంపేట, వారాసిగూడ, తుకారంగేట్, గోపాలపురం, మారేడ్పల్లి, మహంకాళి, రామ్గోపాల్ పేట, మార్కెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న అన్ని మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి.
ఇప్పటికే పలుసార్లు వైన్స్ బంద్: 2025 సంవత్సరంలో ఇప్పటికే పలుమార్లు మద్యం దుకాణాలు మూతబడ్డాయి. ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వైన్స్ దుకాణాలు బంద్ అయ్యాయి. ఇక మార్చి 14న హోలీ కారణంగా హైదరాబాద్లోని మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులను మూసేశారు. ఏప్రిల్ 12 హనుమాన్ జయంతి రోజు కూడా మందు షాపులను బంద్ చేశారు..