పెద్దపెల్లి జిల్లా సుగ్లంపల్లి శివారులో పెద్దమనుషు లపై దాడి..!..భార్యాభర్తల వివాదం దారుణ రక్తపాతానికి దారితీసింది..
పెద్దపెల్లి జిల్లా సుగ్లంపల్లి శివారులో పెద్దమనుషుల సమక్షంలో కొన్నేళ్లుగా భార్య భర్తల పంచాయతి తెగడం లేదని అటుపక్క,ఇటుపక్క పెద్దమనుషులను ఉరికించుకుంటు కత్తులతో పొడిచిన ఇరువర్గాలు ఇద్దరు పెద్ద మనుషులు అక్కడికక్కడే హతం..
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలో జరిగిన భార్యాభర్తల వివాదం దారుణ రక్తపాతానికి దారితీసింది. గ్రామ పెద్దలు నిర్వహించిన పంచాయతీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రమై, కత్తులతో దాడి జరగడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన వివరాలు
సుగ్లాంపల్లి గ్రామానికి చెందిన ఓ దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు గ్రామ పెద్దలు, బంధువుల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేశారు. రాఘవాపూర్‌కు చెందిన అమ్మాయి తరపు వర్గం, ఓదెలకు చెందిన అబ్బాయి తరపు వర్గం సుగ్లాంపల్లి సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో సమావేశమయ్యారు.
పంచాయతీ నడుస్తుండగా మాట మాట పెరిగి, భర్త తరపు బంధువులు భార్య తరపు బంధువులపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో రాఘవాపూర్‌కు చెందిన గాండ్ల గణేష్, ఓదెలకు చెందిన మోటం మల్లేష్ మృతి చెందారు. మరో ఇద్దరు, మారయ్య మరియు మధునయ్య, తీవ్ర గాయాలతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు రిఫర్ చేశారు.
పోలీసుల చర్యలు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గణేష్ మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది..