సంక్రాంతి నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలు!.

హెలీ టూరిజానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ – శ్రీశైలం వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. నల్లమల అడవి మీదుగా గంట పాటు ఈ ప్రయాణం సాగనుంది. ఇది సక్సెస్ అయితే ఉమ్మడి వరంగల్ లోని రామప్ప, లక్నవరానికీ విస్తరించాలని యోచిస్తోంది. ఈ సేవల కోసం బుకింగ్ యాప్ లేదా వెబ్సైట్ తీసుకురానుంది…!!.

ఇందులో భాగంగానే పర్యాటక శాఖ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో కలిసి హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించనుంది. ‘ఈజ్ మై ట్రిప్‌’ వంటి ప్రముఖ సంస్థలతో చర్చలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. మొదట వారాంతాల్లో సేవలు నడిపి, ప్రజల ఆదరణ బట్టి సేవలను విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగానికి కొత్త రూపురేఖలు రానున్నాయని అధికారులు చెబుతున్నారు..

హైదరాబాద్ టూ శ్రీశైలంగా వయా నల్లమల
ఈ సేవలు హైదరాబాద్‌- శ్రీశైలం మధ్య అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన హెలికాప్టర్‌ నల్లమల అడవులు, సోమశిల, అమరగిరి వంటి ప్రాంతాల అందాలను పై నుంచి చూపిస్తూ శ్రీశైలం చేరుకునేలా రూట్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఉన్నందున, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లనున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి శ్రీశైలానికి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ఐదు నుంచి ఆరు గంటలు పడుతోంది. అయితే హెలికాప్టర్‌ ద్వారా ప్రయాణిస్తే కేవలం గంటలోపే గమ్యం చేరుకోవచ్చు. దీంతో ఉద్యోగులు, కుటుంబాలు, అంతర్జాతీయ పర్యాటకులు వీకెండ్‌ ట్రిప్‌లకు సౌకర్యవంతంగా ఈ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది..