నేటి పంచాంగం..కార్తీక శుద్ధ ఏకాదశీ – ఉత్థాన, ఉత్పన్న / ప్రభోదిని ఏకాదశి.

ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 01 – 11 – 2025,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
శుక్ల పక్షం,

తిథి : *ఏకాదశి* రా2.41 వరకు,
నక్షత్రం : *శతభిషం* మ2.26 వరకు
యోగం : *ధృవం* రా11.35 వరకు,
కరణం : *వణిజ* మ3.12 వరకు
తదుపరి *భద్ర* రా2.41 వరకు,

వర్జ్యం : *రా8.41 – 10.15*
దుర్ముహూర్తము : *ఉ6.01 – 7.33*
అమృతకాలం : *ఉ7.18 – 8.53*
రాహుకాలం : *ఉ9.00 – 10.30*
యమగండం : *మ1.30 – 3.00*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *కుంభం*
సూర్యోదయం : *6.02*
సూర్యాస్తమయం : *5.27*

*_నేటి విశేషం_*

*_కార్తీక శుద్ధ ఏకాదశీ – ఉత్థాన, ఉత్పన్న / ప్రభోదిని ఏకాదశి_*
*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*
కార్తీకమాసం శివకేశవులకు చాలా ప్రీతిపదమైన మాసం.
ఈ మాసంలో తొలిగా వచ్చే కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ-ప్రభోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేర్లు.

ఆషాడ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశిగా అయ్యింది.
దీనినే హరి-భోధిని ఏకాదశి అని కూడా అంటారు.
తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది.

ఈ రోజు శ్రీమహావిష్ణువుకు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు,
ఉత్థాన ఏకాదశి నాడే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినట్టు పురాణాలు పేర్కొన్నాయి.
మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య మీద శయనించాడు.
ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరణ చేసి, మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి.

ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి బ్రహ్మదేవునికి నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది.
కార్తిక శుద్ధ ఏకాదశి పాపాలను హరిస్తుంది.
1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది.
కొండంత పత్తిని ఒక చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగ ఒక జీవుడు, తన వేలజన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం.
ఈ రోజు చిన్న మంచిపని (పుణ్యకార్యం) చేసినా, అది మేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుంది.
ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవు.

ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానం కలగడంతో పాటు పాప పరిహారం జరుగుతుంది.
పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల పుణ్యం ఒక్కసారైన ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారదునితో పలుకుతాడు.
ఇంకా ఈ వ్రతంలో ఒకరికి చేసే అన్నదానం వలన సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగాతీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లబిస్తుంది.
వస్త్రదానం చేయడం వలన, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇవ్వడం వలన ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి.

ఈ రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్దులు, యోగులు అందరూ విష్ణులోకం చేరి కీర్తనలతోనూ, భజనలతోనూ, హారతులతోనూ శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని ధార్మిక గ్రంధాలు చెప్తున్నాయి, అందువల్ల కార్తీక శుద్ధ ఏకాదశి నాడు…

*“ ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద! త్యజనిద్రాం జగత్పతే!, త్వయిసుప్తే జగత్ సుప్తం ఉత్థితే చోత్థితం జగత్”*

అని ప్రార్థన చేసి, ఈ రోజున శ్రీ మహావిష్ణువును అర్చించి, ఉపవాసం చేయాలి.
*నేడు భాగవతం లోని “అంబరీషోపాఖ్యానం” పఠనం, శ్రవణం శ్రేష్ఠం, రాత్రి పూట విష్ణునామకీర్తనతో కాలంగడపాలి.* తులసి వనంలో గానీ, తులసి కోట దగ్గర గానీ విష్ణుపూజ చేయాలి.
ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది.

*ఉత్పన్న ఏకాదశి – ఉపవాసం విశిష్టత*
ఉపవాసములు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి.
శ్రీమహావిష్ణువు యొక్క శక్తి స్వరూపములను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనది.

ముర అనబడే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది.
అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని నామధేయం చేశాడు.
సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపములలో ఒకటి, అందువల్ల ఉత్పన్న ఏకాదశి ని ఏకాదశి తిధి యొక్క జయంతిగా భావిస్తారు.

ఈరోజు ఉపవాసం తప్పనిసరిగా చేయవలెను.
ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపములు హరించబడతాయి.
ముర అంటే తామసిక , రాజసిక , అరిషడ్వర్గాలకు ప్రతీక.
ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించిన వారి ఆ మురను జయించి మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠప్రాప్తి పొందగలరు.
వితంతువులు కానీ ఈ రోజు ఉపవాసము ఆచరించిన యెడల ముక్తిని పొందగలరు.

*ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత:*
ఉత్పన్న ఏకాదశి యొక్క గొప్పతనాన్ని శ్రీ కృష్ణుడు మరియు యుధిష్ఠిర రాజు మధ్య సంభాషణ రూపంలో *’భవవ్యోత్తర పురాణం’* వంటి వివిధ హిందూ గ్రంథాలలో వర్ణించారు.
‘సంక్రాంతి’ వంటి పవిత్ర రోజులలో విరాళాలు ఇవ్వడం లేదా హిందూ తీర్థయాత్రలలో పవిత్ర స్నానం చేయడం వంటివి ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత.
ఉత్పన్న ఏకాదశి అతని / ఆమె పాపాల నుండి విముక్తి పొందాడని మరియు చివరికి మోక్షాన్ని పొందుతారని భావిస్తారు.
మరణం తరువాత ‘వైకుంఠం’ విష్ణువు నివాసానికి నేరుగా తీసుకువెళతారు.

*_🌸శుభమస్తు🌸_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏