మహాక్షేత్రం తిరుమల. చారిత్రకంగా కూడా చాలా ప్రాధాన్యం కలిగిన దివ్యధామం. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలవారి భక్తిశ్రద్ధలకు అది ప్రముఖ కేంద్రం. ఎందరో చక్రవర్తులు, భక్తయోగులు కొలుచుకున్న సంస్కృతీ సౌధం. వైఖానస ఆగమరీతులతో అర్చనా విధానాలు, పూజలు జరుగుతున్న సంప్రదాయ పరంపర ఈ శేషాచలానికి ఉంది. ఇక్కడ శ్రీవేంకటేశ్వరుడు సర్వదేవతాత్మకుడైన నారాయణ పరబ్రహ్మమని రుషుల ప్రతిపాదన. ఈ విష్ణువిరాణ్మూర్తి సాక్షాత్ వైకుంఠవాసుడే!
కొలిచిన వారికి కొంగుబంగారంగా, కోరిన కోరికలు తీర్చే శ్రీనివాసుడు ఏడుకొండలపై కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. అందుకే కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం భక్తులు తరలివస్తుంటారు. కాలినడకన, రోడ్డు మార్గం ద్వారా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటారు. మరి కాలినడక మార్గంలో అలిపిరి శ్రీవారి పాదాల మండపం నుంచి తిరుమలకు వెళ్లే రూట్లో ఓ రాతి గుండు కనిపిస్తుంది.
వందల ఏళ్ళుగా ఈ ఆచారం కొనసాగుతుంది. దానికి ఆనవాళ్లుగా తలఏరు గుండుపై ఎన్నో బొడిపులు ఉండడం భక్తులకు ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది..భక్తులు ఎంతో కష్టంతో చంటి బిడ్డలు, వృద్ధులు సైతం అలవోకగా ఏడుకొండలను ఎక్కి స్వామి వారిని దర్శిస్తే చాలు తమ కష్టమంతా తీరుతుందని భక్తులు ఎంతగానో నమ్ముతుంటారు. అయితే అలిపిరి పాదాల మండపం దాటగానే 100 మీటర్ల తరువాత కుడివైపున కనిపించేది తలయేరు గుండు..
అదేదో ఓ రాయి అనుకుంటే మీరు పొరబడినట్లే. దానికో ఓ చరిత్ర ఉంది. అదెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తెలుసుకోవాలి మరి..
ఈ గుండు పేరు తలయేరు
అలిపిరి శ్రీవారి పాదాల మండపం నుంచి తిరుమలకు వెళ్లే కాలినడక మార్గంలో కనిపిస్తుంది. భక్తుల తనిఖీ కేంద్రానికి సమీపంలోని ఉన్న ఈ గుండుకు ప్రత్యేక చరిత్ర ఉంది. కాళ్ల నొప్పులు ఉన్న భక్తులు దీనికి మోకాళ్లు ఆనిస్తే నొప్పిపోతుందని విశ్వసిస్తారు. అందుకే కొందరు భక్తితో మరికొందరు సరదాగా చేస్తుండటంతో అందమైన చిన్నచిన్న గుంతలు ఏర్పడి ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అనంతరం గుండు పైభాగాన ఉన్న ఆంజనేయ స్వామిని స్మరించుకుంటారు. అలా మెట్ల మార్గంలో శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వెళ్తారు..
అదే ఆ గుండుపై తిరుమలకు మార్గం చూపుతున్నట్లు ముందు ఆంజనేయస్వామి కనిపించగా..ఆ గుండు చుట్టూ చిన్న చిన్న గుంతలు కనిపించడం ఒక వంతు ఆశ్చర్యానికి గురయ్యేంతగా ఉంటుంది..ఇలా ఈ గుండు వద్ద మోకాళ్ళు ఆణించి, తలవాల్చి ఆంజనేయస్వామి వారిని ప్రార్ధిస్తే కాళ్ళనొప్పులు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే నేటికి ఇక్కడ భక్తులు మోకాళ్ళు ఆణించి, తలవాల్చి ఆంజనేయుడిని నమస్కరించి తిరుమలకు ప్రయాణం సాగిస్తుంటారు..