భారత్ వైపు దూసుకొస్తున్న దిత్వాహ్ తుఫాన్…!

తుఫానుగా మారి భారత్ వైపు దూసుకొస్తుంది. శ్రీలంకలో బీభత్సం సృష్టించిన ఈ తుఫాను, నవంబర్ 30న తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీరాలను తాకే అవకాశం ఉంది. వాతావరణ శాఖ భారీ వర్షాల నేపథ్యంలో రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది..బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, దిత్వా తుఫానుగా మారి వేగంగా తీరాల వైపు కదులుతోంది. ఈ తుఫాను శ్రీలంకలో బీభత్సం సృష్టించింది. తుఫాన్ వల్ల 50 మందికి పైగా మరణించగా.. అనేక మంది గల్లంతయ్యారు. ఇప్పుడిది భారత్‌వైపు దూసుకొస్తుంది. ఈ తుఫాను నవంబర్ 30 తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీరాలను తాకే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండీ నివేదిక ప్రకారం.. దిత్వా తుఫాను గత 6 గంటల్లో గంటకు 7 కి.మీ. వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతోంది..

శాటిలైట్ లైవ్ అంచనా ప్రకారం.. ‘దిత్వాహ్’ తుపాను ప్రస్తుతం శ్రీలంక భూ ప్రాంతం నుంచి తిరిగి నైరుతీ బంగాళాఖాతంలోకి వచ్చేసింది. సముద్రంలోకి తుపాను వచ్చిందంటే వేగం పుంజుకుంటుంది. ప్రస్తుతం తుపాను ఉత్తరం వైపుగా దూసుకొస్తుంది.. ఇది శనివారం రాత్రి 11.30గంటల సమయంలో చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.. ఆదివారం ఉదయం 11.30 గంటలకు చెన్నైకి 126కిలో మీటర్ల దూరంలో ఉంటుందని అంచనా. ఈ తుపాను చెన్నైలో తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నప్పటికీ.. అది తిన్నగా ఏపీవైపు కదిలే అవకాశాలుకూడా ఉన్నాయి. ఈ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

‘దిత్వాహ్’ తుపాను ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
ఉందని పేర్కొంది…ఆదివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. తుపాను ప్రభావం చూపే అవకాశమున్న ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని వెల్లడించింది. డిసెంబర్ 2వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వచ్చే మూడ్రోజులు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ విభాగం సూచించింది…