ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం అయిన పిఠాపురంలో ఈ రోజు పర్యటించారు. సంక్రాంతి పండుగ దగ్గరకు రావడంతో నియోజకవర్గంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను ప్రారంభించిన అనంతరం పట్టణంలో కాలినడకన ప్రజల వద్దకు వెళ్లి, వారితో ముచ్చటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. పిఠాపురం ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి
ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానం నుంచి పవన్ కళ్యాణ్ వెలుపలికి రాగానే పలువురు ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు నిల్చుని ఉన్నారు. వారి సమస్యలు తెలుసుకునేందుకు వాహన శ్రేణి నుంచి దిగిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి శ్రీ కుక్కుటేశ్వరస్వామి వారి ఆలయం వరకు ప్రజల్ని పలుకరిస్తూ కాలినడకన ముందుకు సాగారు. శ్రీమతి పెద్దింటి అనంత పద్మావతి అనే మహిళ తమకు ఇంటి స్థలం కావాలని కోరారు. మరో మహిళ తమ ఇళ్ల వద్ద విద్యుత్ తీగలు సాగిపోయి కిందికి వచ్చేసి ప్రమాదకరంగా ఉన్నాయని, సాగిపోయిన విద్యుత్ తీగలు తగిలి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను తక్షణం పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
పిఠాపురం పోలీస్ స్టేషన్ పరిశీలన
అనంతరం పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. స్టేషన్లో ఉన్న గదులను చూసి పిఠాపురంలో శాంతి భద్రతల తీరుపై ఆరా తీశారు. స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఫొటోలు దిగారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చి కుక్కుటేశ్వరస్వామి ఆలయ సమీపంలో యానాదుల కాలనీవాసులను పలుకరించారు. శ్రీ దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి యానాదుల కాలనీలో పక్కా ఇళ్లు నిర్మించాలని, డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని పవన్ కళ్యాణ్ కు చెప్పుకున్నారు. శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం వెలుపల ఉన్న దుకాణదారులను పలకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. చివరిగా ఆలయ అర్చకులతో మాట్లాడి వారితో ఫొటోలు దిగారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959