సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. జిల్లాల పునర్వ్యస్థీకరణపై రిటైర్డ్ జడ్జి, విశ్రాంత అధికారులతో కమిటీ ఏర్పాటు..

జిల్లాలు, మండలాల రేషనలైజేషన్ విషయంలో పలు విజ్ఞప్తులు, డిమాండ్స్ వచ్చాయి. గతంలో జిల్లాలు, మండలాలను ఇష్టమొచ్చినట్లు విభజించారు. జిల్లాలు, మండలాల పునర్ వ్యవస్థీకరణకు త్వరలో రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో ఒక కమిషన్‌ను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రేవంత్ మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన అంశంపై కీలక కామెంట్స్ చేశారు. జిల్లాల పునర్విభజన విషయంలో ఏర్పాటు చేయబోయే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ రాష్ట్రమంతా పర్యటించి జిల్లాలు, మండలాల రేషనలైజేషన్ విషయంలో ప్రజల సూచనలు, సలహాలు తీసుకుంటుదని సీఎం రేవంత్ చెప్పారు. రాచకొండ కమిషనరేట్‌ పేరు సహేతుకంగా లేదనే మార్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఏ జిల్లాల పేరును మేము మార్చలేదన్నారు…ప్రభుత్వ ఉద్యోగులందరికీ, రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని అనుకుంటున్నారని చెబుతున్నారు. మనమంతా ఒకే కుటుంబం.. కుటుంబంలో కుమ్మక్కులు ఏం ఉంటాయి.. మీరు, మేము వేరువేరు కాదు.. ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే చూడలేని వారు, కడుపులో విషం పెట్టుకునే వారు ఎప్పుడూ ఉంటారు. దేవతలు కూడా యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేయడానికి ప్రయత్నించారు. ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్‌లో ఉండి అసెంబ్లీకి మారీచుడు లాంటి వాళ్లను పంపిస్తున్నారంటూ పరోక్షంగా కేసీఆర్ పై రేవంత్ విమర్శలు చేశారు.

గత ప్రభుత్వం 8లక్షల కోట్ల అప్పుల భారాన్ని మాపై మోపి వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 18వేల కోట్లు.. కానీ, ప్రతీ నెలా 22వేల కోట్లు అప్పులకు చెల్లించాల్సిన పరిస్థితి. సగటు మధ్యతరగతి వ్యక్తి గౌరవంగా కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో.. ప్రభుత్వానిదికూడా అదే పరిస్థితి. మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లడం వల్లే సమాజంలో తెలంగాణ గౌరవం నిలబడింది. ప్రభుత్వాన్ని నడిపేది కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. పదిన్నర లక్షల మంది ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములే. మీరు మా సారధులు, మా వారధులు.. మీ సోదరుడిగా మీకు అండగా ఉంటా.. గతంలో మీ జీతాలు ఎప్పుడొచ్చేవి..? ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయో ఒకసారి ఆలోచించండి అంటూ రేవంత్ అన్నారు

ట్రాఫిక్ చలాన్ల విషయంలో వాహనదారుల ఆలోచనా విధానం మారాలి..

రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ స్టేడియంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ట్రాఫిక్ నిబంధనల అమలుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుంటే.. ప్రతి మూడు నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు..ట్రాఫిక్ చలాన్ల విషయంలో వాహనదారుల ఆలోచనా విధానం మారాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‘చలాన్లు పడినా ప్రభుత్వం ఎలాగూ డిస్కౌంట్లు ఇస్తుంది కదా’ అనే నిర్లక్ష్యం ప్రజల్లో పెరిగిపోయిందని.. ఇది ప్రమాదాలకు దారితీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే, ఇకపై ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని అధికారులను ఆదేశించారు…మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై సీఎం మండిపడ్డారు. మైనర్లు ప్రమాదాలకు కారకులైతే, వారి తల్లిదండ్రులపైనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలను కేవలం ప్రమాదాలుగా చూడలేమని, అవి మనుషులు చేసే తప్పిదాల వల్ల జరుగుతున్న హత్యలే అని ఆయన వ్యాఖ్యానించారు. శాంతిభద్రతల సమస్య కంటే ఇప్పుడు రోడ్డు ప్రమాదాలే పెద్ద సవాలుగా మారాయన్నారు..