*సర్పంచ్ లకు చెక్ పెట్టేశారు*
*చెల్లింపులు నిలుపుదల*
*అత్యవసరమైతే డిడిఓ అనుమతి*
*సిద్దమవుతున్న ప్రత్యేక అధికారుల జాబితా*
మరో వారం రోజుల్లో పదవి కాలం పూర్తి చేసుకుంటున్న సర్పంచులకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఏప్రిల్ 2 తో వీరి పదవి కాలం ముగుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లోపుగా కొందరు సర్పంచులు నిధులు దుర్వినియోగం చేస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి సర్పంచులు నేరుగా చెల్లింపులు చేయడానికి అవకాశం లేదు. జీతాలు వంటి అత్యవసర చెల్లింపులు చేయాల్సి వస్తే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్(డిడిఓ) ఆమోదించాలి.సర్పంచ్ సిఎఫ్ఎమ్ఎస్ ద్వారా బిల్లులకు థంబ్ వేస్తే మంగళవారం వరకూ నేరుగా ట్రజరికీ వెళ్లేది.కాని ఇప్పుడు డిడివొ లాగిన్ కు వెళుతుంది. ఆయన ఆ ఖర్చులు పరిశీలించి థంబ్ వేస్తేనే ట్రజరీకి వెళుతుంది. అంతేగాక బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ వీడియో కాన్ఫరెన్స్ లో అందరూ జిల్లా పంచాయతీ అధికారులకు(డిపివొ) చెల్లింపులపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా కార్యదర్శులు సర్పంచ్ లతో కుమ్మకై నిధులు తీసుకునే ప్రయత్నం చేస్తే కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో కూడా సర్పంచ్ లకు రెండు మూడు నెలల పదవీకాలం ఉండగానే వారి చెక్ పవర్ రద్దు చేసి చెక్ బుక్ లను అధికారులు స్వాధీనం చేసుకునేవారు. ఇప్పుడు చెక్ లతో పని లేకుండా నేరుగా సిఎఫ్ఎమ్ఎస్ ద్వారా విధులు ఖర్చు చేసుకునే విధానం ఈ ఆంక్షలు విధించారు.
*సిద్ధమవుతున్న ప్రత్యేక అధికారుల జాబితా*
వచ్చే నెల మూడు నుంచి సర్పంచుల స్థానంలో ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకునేందుకు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి మండలాల వారీగా ప్రత్యేక అధికారులను ఎవరు నియమించాలనే దానిపై జాబితాను సిద్ధం చేసి ఆయా జిల్లాల కలక్టర్లకు అందజేయాల్సి ఉంది.అందుకు ముమ్మర కసరత్తులు చేపడుతున్నారు. అసలు ఈ ప్రత్యేకత అధికారులుగా ఎవర్ని నియమిస్తారంటే … మండల స్థాయిలో తాసిల్దార్, ఎంపీడీవో, ఇద్దరు డిప్యూటీ ఎంపీడీవోలు, ఇద్దరు ఎంఈఓ లు, మండల వ్యవసాయ,ఉద్యానవన, వెటర్నరీ, మండల పరిషత్ పరిపాలనాధికారి వంటి వారిని నియమిస్తారు. మండల స్థాయిలో ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఉన్నప్పటికీ వారిని ప్రత్యేక అధికారులుగా నియమించడానికి నిబంధనలు వర్తించవు. ఎందుకంటే వారే పనులకు సంబంధించి ఎం బుక్ చెక్ మెజర్మెంట్ చేస్తారు.అందువల్ల వాళ్లకే నిధులు ఖర్చు పెట్టే అవకాశం ఉండదు. కొన్ని మండలాల్లో ఎక్కువ గ్రామపంచాయతీ ఉండటం వల్ల రెండు,మూడు పంచాయతీలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించే అవకాశాలు ఉన్నాయి.అయితే తాసిల్దార్, మండల విద్యాశాఖ వంటి అధికారులు బిల్లులు చెల్లింపులో మరింత లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటంతో పాటు గ్రామ పంచాయతీ వ్యవస్థపై తగినంత అవగాహన లేకపోవడం వల్ల వారిని ప్రత్యేక అధికారులుగా నియమించుకోవడానికి చాలా మంది ఉత్సవం చూపడం లేదని సమాచారం.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1,069 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాల విభజన అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 342 గ్రామ పంచాయతీలు, కాకినాడలో 385,తూర్పుగోదావరి జిల్లా 342 గ్రామ పంచాయతీలు ఉన్నాయి..