మధ్యప్రదేశ్‌లోని బర్గి డ్యామ్​లో పడవ ప్రమాదం..

మధ్యప్రదేశ్‌లోని బర్గి డ్యామ్​లో జరిగిన పడవ ప్రమాదం కేవలం ఒక ప్రమాదం కాదు… ఇది వ్యవస్థలోని లోపాల ప్రతిబింబంగా మారింది. నర్మదా నది బ్యాక్‌వాటర్స్‌లో వినోద యాత్రగా ప్రారంభమైన క్రూజ్ ప్రయాణం క్షణాల్లోనే విషాద యాత్రగా మారింది. సుమారు 30 మంది ప్రయాణికులతో సాగిన పడవ తీవ్రమైన గాలులకు లోనై తిరగబడటంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు ప్రాణాల కోసం నీటిలో పోరాడిన దృశ్యాలు ఈ ఘటన తీవ్రతను వెల్లడిస్తోంది… కుటుంబాలతో కలిసి ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన పర్యాటకులు హఠాత్తుగా మృత్యువును ఎదుర్కోవాల్సి వచ్చింది. నవ్వులు, సెల్ఫీలు, ఉత్సాహం నిండిన నావలో కొద్దిసేపట్లోనే కేకలు, భయం, ఆర్తనాదాలు మార్మోగాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ప్రయాణికులు పరిస్థితిని అర్థం చేసుకునేలోపే ప్రమాదం సంభవించింది.పడవ నీటి మధ్యలో ఉన్న సమయంలో గాలులు ఒక్కసారిగా వేగం పెంచుకున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల ఎగిసిన అలలు పడవను అదుపు తప్పేలా చేశాయి. కొద్ది నిమిషాల్లోనే పడవ తిరగబడి నీటిలో మునిగిపోయింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, పడవలోకి నీరు చేరడం ప్రారంభమైన తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.

బలమైన గాలుల వల్ల నీరు ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులు ప్రమాదాన్ని పసిగట్టి ఒడ్డుకు తీసుకెళ్లాలని సిబ్బందిని వేడుకున్నా ఫలితం లేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇప్పటివరకు 22 మందిని సురక్షితంగా బయటకు తీశారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), స్థానిక పోలీసులు మరియు అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.ప్రమాదంపై భద్రతా లోపాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికులందరికీ లైఫ్ జాకెట్లు ఇవ్వలేదని ఒక బాధితుడు ఆరోపించారు. లైఫ్ జాకెట్లు ధరించిన వారు కూడా ఎందుకు ప్రాణాలు కోల్పోయారనే దానిపై విచారణ జరుపుతామని మంత్రి రాకేశ్ సింగ్ తెలిపారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ఘటనపై స్పందిస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పర్యాటక శాఖ మంత్రి ధర్మేంద్ర భవ్ సింగ్ లోధి మాట్లాడుతూ, ఈ విషాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు..