కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్‌లో కాల్పుల కలకలం..

కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్‌లో కాల్పుల కలకలం..

షాపులోకి చొరబడ్డ నలుగురు దొంగలు కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాల దోపిడి..

నలుగురు సిబ్బందికి గాయాలు.. సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు..

కరీంనగర్‌ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జ్యోతినగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీ షాపులోకి ఐదుగురు దుండగులు తుపాకులతో చొరబడ్డారు. సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి అందినకాడికి బంగారు నగలను దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది…స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10.45 గంటల ప్రాంతంలో జ్యోతినగర్‌లోని పీఎంజే జ్యువెలరీ సిబ్బంది షాపు తెరిచి లాకర్ల నుంచి డిస్‌ప్లేలో నగలు పెడుతున్నారు. ఆ సమయంలో రెండు బైక్‌లపై ఐదుగురు దుండగులు షాపులోకి ప్రవేశించారు. తుపాకులు చూపించి నగలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిపై 7-8 రౌండల్ కాల్పులు జరిపారు. అనంతరం పెద్ద బ్యాగ్‌లో బంగారు నగలను తీసుకుని పరారయ్యారు. ఈ కాల్పుల్లో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జ్యువెలరీ షాపులో దోపిడీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. ఘటనాస్థలిలో కొన్ని బుల్లెట్‌ షెల్స్‌, తుపాకీ మ్యాగజైన్‌ స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ దోపిడీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి, అదును చూసి ఎటాక్‌ చేశారని భావిస్తున్నారు. హడావుడి తక్కువగా ఉంటుందనే ఉదయాన్నే దోపిడీకి ప్లాన్‌ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు..

రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది...

జ్యువెలరీ షాపులోకి దుండగులు తుపాకులు, మారణాయుధాలతో చొరబడి సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. పట్టపగలే జనసంచారం ఉన్న ప్రాంతంలో కాల్పుల శబ్దాలు వినపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, ఏసీపీ వెంకటస్వామి ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు…

ఈ దోపిడీలో సుమారు కిలో వరకు బంగారం దోచుకున్నట్లు తెలుస్తోంది. దోపిడీ అనంతరం దుండగులు ఆ ప్రాంతం నుండి అత్యంత వేగంగా పారిపోతున్న దృశ్యాలు మరియు రోడ్డుపై బైక్‌లపై ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన సీపీ గౌస్ ఆలం, నిందితులు హిందీ మరియు తెలుగు భాషల్లో మాట్లాడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. గాయపడిన సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించామని ఆయన స్పష్టం చేశారు. నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.