సింధు జలాలపై భారత్‌ను టార్గెట్ చేసిన పాక్ మంత్రి.

సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ తప్పుడు వైఖరి అవలంబిస్తోందని పాకిస్థాన్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ఆరోపించారు. భారత్ ఎగువ దేశంగా ఉండటంతో అక్కడి నుంచి నదులు పాకిస్థాన్‌లోకి ప్రవహిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ పరిస్థితిని భారత్ తమకు వ్యతిరేకంగా నీటిని ఆయుధంగా ఉపయోగించుకునేందుకు అవకాశంగా మార్చుకుంటోందని ఆరోపించారు.
దక్షిణాసియాలో శాంతి, ప్రాంతీయ స్థిరత్వానికి భారత్ పాత్ర అత్యంత కీలకమని అహ్సాన్ ఇక్బాల్ పేర్కొన్నారు. దక్షిణాసియా మధ్యలో భారత్ ఉందని, మిగతా దేశాలన్నీ దాని చుట్టూ ఉన్నాయని ఆయన అన్నారు. అందువల్ల ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగించే చర్యలకు భారత్ పాల్పడకూడదని సూచించారు.
సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారత్ నిర్ణయంపై ప్రశ్నించగా.. అవసరమైన సమయంలో నీటి సరఫరాను అడ్డుకునేలా భారత్ నీటిని ఆయుధంగా ఉపయోగించే ముప్పును పాకిస్థాన్ ఎదుర్కొంటోందని ఇక్బాల్ వ్యాఖ్యానించారు.
ఇదే అంశంపై గతంలోనూ భారత్‌పై అహ్సాన్ ఇక్బాల్ ఆరోపణలు చేశారు. పంజాబ్‌లో సంభవించిన వరదలకు భారత్ కారణమని ఆరోపిస్తూ.. రావి, సట్లేజ్ నదుల్లోకి భారత్ నీటిని విడుదల చేయడం వల్ల పాకిస్థాన్ పంజాబ్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో వరదలు వచ్చాయని పేర్కొన్నారు.