చంద్రుడిపై నీటి రహస్యాన్ని ఛేదించేందుకు చైనా ‘చాంగీ-7’.

చంద్రుడిపై నీటి ఉనికిపై మరింత లోతుగా పరిశోధించేందుకు చైనా సిద్ధమవుతోంది. చైనా చేపడుతున్న చాంగీ-7 మిషన్‌.. జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలోని నీరు, ఇతర సహజ వనరులపై కీలక సమాచారం సేకరించనుంది. మరోవైపు అమెరికా నాసా కూడా ఆర్టెమిస్‌ కార్యక్రమం ద్వారా చంద్రుడిపై భవిష్యత్‌ మానవ కార్యకలాపాలకు అవసరమైన వనరులను గుర్తించే ప్రయత్నాలు చేస్తోంది.
చంద్రుడిపై నీరు ఉన్నట్లు శాస్త్రవేత్తలకు ఇప్పటికే స్పష్టమైన ఆధారాలు లభించాయి. అయితే.. అక్కడి అత్యంత శీతల, చీకటి ప్రాంతాల్లో నీరు ఏ రూపంలో ఉందన్నది ఇప్పటికీ పూర్తిగా తెలియదు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సుమారు మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్‌ వరకు పడిపోతాయని అంచనా.
ఈ నేపథ్యంలో చాంగీ-7 మిషన్‌ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని మరింత దగ్గరగా అధ్యయనం చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రత్యేక ఆకర్షణ ‘హాపర్‌’
చాంగీ-7లో ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌తో పాటు ప్రత్యేకంగా హాపర్‌ను పంపనున్నారు. సాధారణ రోవర్‌లా చక్రాలపై ప్రయాణించే బదులు.. చంద్రుడి ఉపరితలంలోని గుంతలు, నెర్రెలు వంటి అడ్డంకులను దాటేందుకు హాపర్‌ ఎగిరే సామర్థ్యాన్ని ఉపయోగించనుంది.
దీంతో సాధారణ వాహనాలు చేరుకోలేని ప్రాంతాలను కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చంద్రుడి దక్షిణ ధ్రువంలోని శాశ్వతంగా నీడలో ఉండే ప్రాంతాల్లో నీటి మంచు, ఇతర వనరులపై సమాచారం సేకరించేందుకు ఇది ఉపయోగపడనుంది.
క్యూకియావో-2తో కీలక అనుసంధానం
2024 మార్చిలో ప్రయోగించిన క్యూకియావో-2 రిలే శాటిలైట్‌ కూడా చాంగీ-7 మిషన్‌కు కీలకంగా పనిచేయనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతం నుంచి భూమికి సమాచారాన్ని చేరవేయడంలో ఇది సహాయపడుతుంది.
చంద్రుడిపై భవిష్యత్‌ మానవ కార్యకలాపాలకు అవసరమైన నీరు, ఖనిజాలు, ఇతర వనరులను గుర్తించడం చైనా, అమెరికా అంతరిక్ష కార్యక్రమాల్లో కీలక లక్ష్యంగా మారింది. ఈ నేపథ్యంలో చాంగీ-7 ప్రయోగం చంద్రుడిపై వనరుల అన్వేషణలో మరో ముఖ్యమైన ముందడుగుగా నిలవనుంది…రెండేళ్ల తరువాత అంటే 2028లో జరిగే చాంగీ-8 ద్వారా ఈ వనరులను వాడుకోవడం ఎలా? అన్నదాన్ని పరిశీలించాలన్నది చైనా ఆలోచన. తరువాతి దశలో భాగంగా మానవ సిబ్బంది జాబిల్లిపైకి చేరతారు. చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మిని్రస్టేషన్, రష్యాకు చెందిన రస్‌కాస్మోస్‌ స్పేస్‌ ఏజెన్సీలు రెండు కలిసి ”ఇంటర్నేషనల్‌ లూనార్‌ రీసెర్చ్‌ స్టేషన్‌”నిర్మాణం చేపడతాయి. ఏతావాతా… జాబిల్లిపైకి చేరడం ఎలా అన్నది 20వ శతాబ్ధపు అతిపెద్ద సాంకేతికపరమైన సవాలుగా మారుతుంది…