భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరలో ఆర్నాభ్ తూఫాన్ విధ్వంసం.
ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి…
చుట్టూ చీకటి,భారీగా దుమ్ము,నల్లటి మేఘాలు.
ఒక భయానక సంఘటన చూసాము అని బాధితులు చెప్తున్నారు.
చెట్లు,రేకులు గాలికి ఎగిరిపడ్డాయి.. మనుషులు కూడా కాస్త దూరం నెట్టబడ్డారు.
అదృష్టవశాత్తు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి మరింత తీవ్రరూపం దాల్చుతోంది. ఇది రాత్రికి తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ విభాగం వెల్లడించింది. అయితే తక్షణమే తుపానుగా మారే ముప్పు ప్రస్తుతానికి లేదని స్పష్టం చేసినప్పటికీ, తీవ్ర వాయుగుండంగా బలపడి తీరం వైపు పయనించే క్రమంలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఒకవేళ మరింత శక్తిని పుంజుకుని తుపానుగా రూపాంతరం చెందితే.. దానికి అర్నాబ్ అని నామకరణం చేయనున్నారు. బంగ్లాదేశ్ సూచించిన ఈ పేరుకు సముద్రం అనే అర్థం…తీరం వైపు నత్తనడకన ప్రయాణం
వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్కు నైరుతి దిశలో దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి తూర్పుగా 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. విశాఖపట్నం – గోపాల్పూర్ రేవుల మధ్య బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇది తీరాన్ని తాకే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రభావంతో గంటకు 70 కిలోమీటర్ల పెనుగాలులతో పాటు కోస్తా తీరం వెంబడి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో దంచికొట్టనున్న వర్షాలు
ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో దక్షిణ బెంగాల్లోని ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, తూర్పు మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్, బీర్భూమ్ జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. కోల్కతా సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడనున్నాయి. దక్షిణ బెంగాల్ జిల్లాలతో పాటు జార్గ్రామ్, పురూలియా జిల్లాల్లో బుధ, గురువారాల్లో వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో పిడుగుపాటు ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దని విపత్తు నిర్వహణ విభాగం సూచించింది. ఉత్తర బెంగాల్లోని డార్జిలింగ్, జల్పైగురి, కాలింపాంగ్ తదితర జిల్లాల్లోనూ శుక్రవారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.