ఉచితంగా విత్తనాలు.. ఉచితంగా సలహాలు.. అందరి రైతు మంగ్తా నాయక్
తండాలో పుట్టి జిల్లాకే ఆదర్శంగా – నంది అవార్డు గ్రహీత మంగ్తా నాయక్ ప్రస్థానం
కుటుంబంలో ఎవరూ చేయనిది చేసి చూపిన రైతు – అన్ని పంటలకు కేరాఫ్ మంగ్తా
దేవరకొండ గొట్టిముక్కల కొర్రతండా
దేవరకొండ …….
మండలం గొట్టిముక్కల కొర్రతండాలో ఒక ఆదర్శ రైతు పేరు ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. ఆయనే నంది అవార్డు గ్రహీత కొర్ర మంగ్తా నాయక్. పంటలు పండించడమే కాదు, తోటి రైతులకు ఉచితంగా విత్తనాలు ఇస్తూ, సలహాలు సూచనలు ఇస్తూ అందరి దృష్టిలో నిలిచిపోతున్నాడు.
కుటుంబంలో ఎవరూ చేయని ప్రయోగం..
మంగ్తా నాయక్ కుటుంబ నేపథ్యం సాధారణ వ్యవసాయ కుటుంబమే. ఆయన కుటుంబంలో గతంలో ఎవరూ ఇంత ప్రయోగాత్మకంగా, అన్ని రకాల పంటలు వేసిన దాఖలాలు లేవు. కేవలం ఒకటి రెండు పంటలకే పరిమితమయ్యేవారు. కానీ మంగ్తా నాయక్ చిన్నప్పటి నుండి వ్యవసాయం అంటే ప్రాణం పెట్టాడు. సంప్రదాయ పద్ధతులను పక్కన పెట్టి, కొత్త కొత్త పంటలు వేయాలనే తపనతో ముందుకు సాగాడు.
రెండు తెలుగు రాష్ట్రాల సైంటిస్టులతో టచ్ లో ఉంటూ, వారి సలహాలు తీసుకుంటూ పంటలు వేస్తున్నాడు. కొన్నిసార్లు నష్టం వచ్చినా వెనక్కి తగ్గలేదు. “నష్టం వచ్చినప్పుడే కొత్త విషయం నేర్చుకుంటాం, మళ్లీ ప్రయత్నిస్తే దిగుబడి తప్పకుండా వస్తుంది” అనేది ఆయన మాట.
6 ఎకరాల్లో 24 క్వింటాళ్ల అద్భుతం..
దీనికి నిదర్శనమే తాజా మినుముల పంట. MBG మధిర బ్లాక్ సీనియర్ సైంటిస్ట్ రుక్మిణి గారి సలహాతో 6 ఎకరాల్లో మినుములు వేశాడు. ఎకరాకు కేవలం 4 కిలోల విత్తనం చొప్పున వేయగా, ఎకరాకు ఏకంగా 5 క్వింటాళ్ల చొప్పున మొత్తం 24 క్వింటాళ్ల దిగుబడి సాధించాడు. ఈ దిగుబడి చూసి సైంటిస్టులు సైతం అభినందించారు. గత ఏడాది నువ్వులు వేసి కూడా మంచి లాభం పొందాడు.
నా సలహాలు పాటిస్తే అన్ని పంటలు.. అందరికీ ఉచిత విత్తనాలు..
మంగ్తా నాయక్ వేయని పంట అంటూ లేదు. మిర్చి, టమాటా, వంకాయ, క్యాబేజీ, చిక్కుడు, కాకరకాయలు, పసుపు, స్వీట్ కార్న్, జొన్న, రాగులు, సజ్జలు, ఆవాలు, ఉల్లిగడ్డలు ఇలా అన్ని రకాల ఆహార, కూరగాయ పంటలు పండిస్తున్నాడు.
అంతేకాదు, తాను పండించిన పంటల్లో నుండి నాణ్యమైన విత్తనాలను సేకరించి చుట్టుపక్కల రైతులకు, ముఖ్యంగా గిరిజన తండాల రైతులకు ఉచితంగా అందిస్తున్నాడు. విత్తనంతో పాటు ఎలా వేయాలి, ఎరువులు ఎలా వాడాలి, చీడపీడలను ఎలా నివారించాలి అనే విషయాలపై ప్రతి ఒక్కరికీ సలహాలు, సూచనలు ఇస్తున్నాడు.
ఈ సేవా గుణం, ప్రయోగాత్మక సేద్యం కారణంగానే ఆయనకు నంది అవార్డు దక్కింది. ఒక సాధారణ తండా రైతు స్థాయి నుండి జిల్లా వ్యాప్తంగా ఆదర్శ రైతుగా ఎదిగిన మంగ్తా నాయక్ కథ నేటి యువ రైతులకు స్ఫూర్తిదాయకం.