చైనాలోని ఒక పల్లెటూరిలో ఒక యువకుడు ఉండేవాడు. అతనికి బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. ఆకాశంలో ఎగిరే పక్షినైనా, నీటిలో ఈదే చేపనైనా, పురి విప్పిన నెమలినైనా, వానలో తడిసే పువ్వునైనా… ఒక్కసారి చూస్తే చాలు మనసులో అలాగే ముద్రించుకొని కళ్ళు మిరమిట్లు గొలిపేలా బొమ్మను గీసేవాడు. కానీ ఆ యువకుడు చాలా పేదవాడు. సంపాదించిందంతా తినడానికీ, ఉండడానికే సరిగ్గా సరిపోయేది. దాంతో బొమ్మలు వేయడానికి కావలసిన కుంచెలు, రంగులు, కాగితాలు ఏవీ ఉండేవి కాదు. అయినా ఆ యువకుడు కొంచెం కూడా నిరాశపడేవాడు కాదు. నేలపైన, గోడల పైన, పలకల పైన… పుల్లలతో, బలపాలతో, బొగ్గులతో చక్కని చిత్రాలు గీసేవాడు. పువ్వుల నుంచి, ఆకుల నుంచి రకరకాల రంగులు తయారుచేసి ఉపయోగించేవాడు. ఆ బొమ్మలను చూసి అందరూ “నీ అంత అపురూపమైన చిత్రకారుడు ఈ చుట్టుపక్కల ఊర్లలో ఎక్కడా ఉండడు. ఆ బొమ్మల్లో జీవకళ ఉట్టి పడతావుంది” అని తెగ మెచ్చుకునేవాళ్ళు.
ఒకరోజు ఆ యువకుడు ఒక అందమైన బొమ్మ గీసి అలసి అలాగే దాని మీదే పడుకుని నిద్రపోయాడు. కలలో ఒక ముసలాయన కనపడ్డాడు. ఆ ముసలాయన యువకుని వంక చూస్తూ “ఓ అందమైన చిత్రకారుడా… ఇదిగో నీకోసం ఒక అద్భుతమైన కుంచె తీసుకొని వచ్చాను. ఇటువంటి అపురూపమైన కుంచె మరొకటి ఎక్కడా ఉండదు. నీ పట్టుదల, నైపుణ్యం, మంచి మనసు చూసి దీన్ని నీకు ఇస్తున్నా. కానీ జాగ్రత్త. దీనిని పేదవాళ్లకు సాయం చేయడానికి మాత్రమే ఉపయోగించు” అంటూ ఒక బంగారు కుంచెను అందించి మాయమయ్యాడు.
ఆ యువకుడు పొద్దున లేచి చూస్తే ఇంకేముంది పక్కనే ధగధగా మెరిసిపోతున్న ఒక అపురూపమైన బంగారు కుంచె కనపడింది. రాత్రి వచ్చింది కల కాదు నిజం అని అర్థమైంది. ఆ యువకుడు సంబరంగా ఆ కుంచె తీసుకొని గోడమీద అందమైన నెమలి బొమ్మ గీయడం మొదలుపెట్టాడు. బొమ్మంతా పూర్తి చేసి హమ్మయ్య అనుకునేసరికి హఠాత్తుగా గోడ మీది నెమలి బొమ్మ నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. చూస్తుండగానే అది తన రెక్కలను విదుల్చుకుంటూ గోడలోంచి బయటికి వచ్చి నిజమైన నెమలిగా మారిపోయి కిటికీలోనుంచి ఎగిరి బయటికి వెళ్లిపోయింది.
ఆ యువకుడు ఒక్క నిమిషం అలాగే ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. తన చేతిలో వున్నది మామూలు కుంచెకాదు ప్రాణం పోసే కుంచె అని అర్థమైంది. దాంతో మరొకసారి దాని శక్తిని పరీక్షిద్దాం అనుకున్నాడు. నెమ్మదిగా ఒక చిన్న చెరువు దగ్గరికి చేరుకున్నాడు. చెరువు ఒడ్డున నేలమీద ఒక అందమైన చేప బొమ్మ గీశాడు. ఎప్పుడైతే బొమ్మ చివరి గీత పూర్తయిందో ఆ మరుక్షణం ఆ బొమ్మ కదలడం మొదలుపెట్టింది. చూస్తుండగానే దానికి ప్రాణం వచ్చి ఎగిరి పక్కన వున్న చెరువులోకి దభీమని దుంకింది. సంబరంగా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. దాంతో ఆ యువకునికి తాను ఏం గీస్తే అది నిజంగానే ప్రాణం పోసుకుంటుందని అర్థమైంది.
తనకు ఆ మాయా కుంచె ఇచ్చిన ఆ ముసలాయనకు మనసులోనే దండం పెట్టుకున్నాడు. అతను చెప్పినట్లే పేదవాళ్లకు సాయం చేయాలి అనుకున్నాడు. తిండి లేని పిల్లలకు, ముసలి వాళ్లకు బియ్యం బస్తాలు, పళ్ళబుట్టలు గీసి ఇచ్చాడు. రైతులకు నాగళ్ళు, ఎద్దులు, బళ్ళు గీసి ఇచ్చాడు. ఆడవాళ్లకు చీరలు, ఇంటి సామానులు గీసి ఇచ్చాడు. పొలాల పక్కన బావులు, ఊరి బయట నీటితో నిండిన చెరువులు గీయసాగాడు. చూస్తుండగానే ఆ ఊరంతా పచ్చగా తయారైంది. ప్రతి ఒక్కరికి చేతినిండా పని, కడుపునిండా తిండి దొరకసాగింది. ఆ యువకుని శక్తి గురించి నెమ్మదిగా ఒకరినుంచి ఒకరికి పాకుతూ ఆ ఊరి రాజు చెవికి చేరింది.
ఆ రాజు పెద్ద ఆశపోతు. ఎంత సంపాదించినా ఇంకా కావాలి అని ఆశపడుతూ ఉంటాడు. అతనికి ఆ మాయా కుంచె గురించి తెలిసి “అటువంటి అపురూపమైన కుంచె తన దగ్గర ఉంటే ఇక లోకంలో ఎవరికీ లేనంత సంపద తానే స్వయంగా సృష్టించుకోవచ్చు” అనుకున్నాడు. వెంటనే పోయి అతన్ని బంధించి తీసుకురమ్మని తన సైనికులను పంపించాడు.
కానీ ఈ వార్త సైనికులు రాకముందే ఆ యువకునికి చేరిపోయింది. దాంతో ఎవరికీ కనబడకుండా ఒక ఇంటిలో రహస్యంగా దాచిపెట్టుకున్నాడు. ఆకలేసినప్పుడల్లా తనకు ఏవి కావలిస్తే అవి గీసి తినసాగాడు. కానీ ఎన్ని రోజులు అలా ఒంటరిగా, ఏ పనీ చేయకుండా అక్కడ ఉండగలడు. దాంతో పొద్దుపోవడం కోసం తనకు ఎంతో ఇష్టమైన బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. కానీ బొమ్మ పూర్తయిన మరుక్షణం దానికి ప్రాణం వస్తుంది కదా… అందుకని ఏ బొమ్మ గీసినా దానిని మొత్తం పూర్తి చేసేవాడు కాదు. పక్షులు జంతువులు గీస్తే కళ్ళు వేసేవాడు కాదు. ఇల్లు పొలాలు గీస్తే చివరి గీత గీసేవాడు కాదు. అలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా ఒకరోజు అనుకోకుండా ఒక పొరపాటు చేశాడు.
ఆ రోజు ఒక అందమైన పెద్ద కొంగ బొమ్మ గీశాడు. దానికి కన్ను మాత్రం గీయలేదు. కుంచె పైన పెట్టేశాడు. కానీ ఆ కుంచె సరిగా కడగకపోవడంతో దానిలో కొంచెం నల్లరంగు మిగిలిపోయింది. అది నెమ్మదిగా జారి సరిగ్గా కింద వున్న కొంగ బొమ్మ మొహం మధ్యలో పడింది. దాంతో ఆ చుక్క కన్నులా అందంగా తయారై బొమ్మ పూర్తయింది. అంతే నెమ్మదిగా అది కాగితంలోనుంచి కదలి బయటికి వచ్చింది. రెక్కలు విదిలించింది. నిజమైన పెద్ద కొంగగా మారి గట్టిగా అరుస్తూ కిటికీలోంచి బయటికి ఎగిరింది.
ఆ ఊరిలో కొంగలు ఎక్కడా లేవు. అలాంటిది ఒక కొంగ పెద్దగా అరుస్తూ ఎగిరిపోవడం ఒక సైనికుడు గమనించాడు. వెంటనే విషయం సైనికాధికారికి తెలియజేశాడు. దాంతో అతను వందమంది సైనికులతో రహస్యంగా ఆ ఇంటిని చుట్టుముట్టాడు. నిద్రపోతావున్న యువకునికి ఇదేమీ తెలియదు. దాంతో సులభంగా పట్టుబడ్డాడు. వెంటనే వాళ్ళు ఆ యువకున్ని ఆ మాయాకుంచెతో సహా తీసుకపోయి రాజు ముందు నిలబెట్టారు.
రాజు ఆ మాయాకుంచె తీసుకొని “చూడు… ఇలాంటి అపురూపమైన వస్తువులు రాజ్యాన్ని పాలించే నాలాంటి రాజుల వద్ద ఉండాలి గానీ నీలాంటి సామాన్యుల వద్ద కాదు. ఇకపై దీని మీద అధికారం మొత్తం నాదే” అంటూ ఆ యువకున్ని కోటలో బంధించాడు. రాజు సంబరంగా ఆ కుంచె తీసుకొని బంగారు ఇటుకలు గీశాడు. కానీ అవి రాళ్ళ కుప్పగా మారి కిందపడ్డాయి. రత్నాలు వజ్రాలు గీశాడు. అవి తేళ్లు పాముల్లాగా మారి అందరినీ పరుగులు పెట్టించాయి. దాంతో రాజుకు ఆ మాయాకుంచె కేవలం ఆ యువకుని చేతిలో మాత్రమే పని చేస్తుందని అర్థమైంది. వెంటనే ఆ యువకున్ని మరలా పిలిపించాడు.
“చూడు నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నిన్ను ప్రాణాలతో వదిలిపెడతా. లేకపోతే అన్నం నీళ్లు లేకుండా చీకటిగదిలో బంధించి చంపుతా… వింటావా, చస్తావా” అన్నాడు. ఆ యువకుడు తప్పించుకునే దారి లేక “అలాగే మహారాజా… చెప్పండి ఏం చేయాలో” అన్నాడు. అప్పుడు ఆ రాజు “నాకు అంతులేని సంపదలు కావాలి. బంగారు ఇటుకలు, రత్నాల హారాలు, విలువైన వజ్రాలు గీసి ఇవ్వు” అన్నాడు.
ఆ యువకుడు కాసేపు ఆలోచించి “మహారాజా నేనింతవరకు పక్షులు, జంతువులు, రైతులకు కావలసిన వస్తువులు తప్ప విలువైనవి ఎప్పుడూ గీయలేదు. నాకు ఒకరోజు సమయం ఇవ్వండి. వాటిని ఎలా గీయాలో నేర్చుకుని వస్తా” అన్నాడు. రాజు ‘సరే’ అని వానికి ఆ మాయాకుంచె ఇచ్చి తిరిగి కారాగారంలో బంధించాడు. పారిపోకుండా పదిమంది సైనికులను కాపలా పెట్టాడు.
రాత్రి అందరూ పండుకున్నాక ఆ యువకుడు మాయాకుంచె తీశాడు. కారాగారం గోడమీద ఒక తలుపు గీశాడు. బొమ్మ గీయడం పూర్తయిన మరుక్షణం ఆ గోడకు ఒక నిజమైన తలుపు ఏర్పడింది. వెంటనే దాన్ని తెరచి బయటకు అడుగుపెట్టాడు. తరువాత వేగంగా పరుగెత్తే ఒక బలమైన గుర్రం బొమ్మ గీశాడు. వెంటనే గుర్రం లేచి నిలబడింది. దాని మీదకు ఎక్కి చీకట్లో దూసుకుపోయాడు. కానీ ఈ విషయం వెంటనే రాజుకు తెలిసిపోయింది. కోపంతో రగిలిపోయాడు. రాజ్యం దాటకముందే పట్టుకోమని సైన్యాన్ని ఆజ్ఞాపించాడు.
అంతే… మొత్తం కోట తలుపులన్నీ మూసివేశారు. అడుగుకో సైనికున్ని కాపలాగా నిలబెట్టారు. ఒక్క ఇల్లు కూడా వదలకుండా వీధి వీధి గాలించసాగారు. దాంతో పారిపోవాలనుకున్న ఆ యువకుడు కోట తలుపు దాటడానికి ప్రయత్నిస్తూ మరలా తిరిగి పట్టుబడ్డాడు. కాళ్లుచేతులు కట్టేసి రాజుముందు నిలబెట్టారు.
రాజు కోపంగా ఊగిపోతూ కత్తిని తీసి ఆ యువకుని గొంతు మీద పెట్టి “ఏరా… నన్నే మోసం చేయాలనుకుంటున్నావా. నీకు నరకం అంటే ఎలా ఉంటుందో బ్రతికి ఉండగానే చూపిస్తా. అరగంటలో అంతులేని సంపదలు గీసిస్తావా లేక నీ శరీరంలోని ఒక్కొక్క అవయవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయమంటావా” అన్నాడు. ఆ యువకునికి తప్పించుకోవడం అసాధ్యమని అర్థమయింది. కానీ ఆ కుంచె ముసలాయన ఇచ్చింది పేదవాళ్ళను కాపాడడానికే గానీ బలిసిన ధనవంతుల అంతులేని కోరికలు తీర్చడానికి కాదు కదా… మరి ఎలా ఈ రాజు పీడ తొలగించుకోవడం అని చకచకా ఆలోచిస్తూ వుంటే మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చింది.
“మహారాజా దయచేసి నా తప్పుకు మన్నించండి. మీరు నన్ను మరలా మరలా అడగకుండా ఎన్నిసార్లు ఎంత తెచ్చుకున్నా తరగనటువంటి బంగారాన్ని తయారుచేసి మీ ముందు ఉంచుతాను. ఆ తరువాత నన్ను ప్రాణాలతో వదిలివేయాలి” అన్నాడు. రాజు ‘సరే’ అన్నాడు.
ఆ యువకుడు రాజును ఊరి బయటకు పోయాడు. అక్కడ నేల మీద ఒక పెద్ద బంగారుకొండను గీశాడు. అంతే మరుక్షణం చూస్తుండగానే ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు కొండ ప్రత్యక్షమైంది. ఆ తర్వాత దాని చుట్టూ ఒక పెద్ద సముద్రాన్ని గీచాడు. అంతే మరుక్షణం పెద్దపెద్ద అలలతో కనుచూపుమేరా నీళ్లతో ఒక భయంకరమైన సముద్రం ప్రత్యక్షమైంది. నీళ్ల మధ్యలో మాయమైన బంగారు కొండను చూసి “అదేంది చుట్టూ అంత పెద్ద సముద్రాన్ని ఎందుకు గీశావు. భూమ్మీదనే ఆ బంగారు కొండ గీస్తే సరిపోతుంది కదా. అక్కడికి పోవడం ఎంత కష్టం” అన్నాడు రాజు.
దానికి ఆ యువకుడు చిరునవ్వు నవ్వి “మహారాజా… ఈ బంగారు కొండ విషయం అతిత్వరలో చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ తెలిసిపోతుంది. దాంతో దాన్ని చేజిక్కించుకోవడానికి పెద్ద పెద్ద సేనలతో మీ మీదికి విరుచుకుపడతారు. అప్పుడు మీ జీవితమంతా యుద్ధాలు చేయడానికే సరిపోతుంది. అందుకే సముద్రం మధ్యలో గీశాను. అది అందరికీ కనపడదు. తెలిసినా అక్కడికి వెళ్ళే దారి ఎవరూ కనిపెట్టలేరు. ఆ రహస్యం మీకు మాత్రమే చెబుతాను” అన్నాడు.
ఆ మాటలకు రాజు “శభాష్ యువకుడా… నీ తెలివి అమోఘం. మరి దాన్ని చేరడానికి దారి కూడా చెప్పు” అన్నాడు. యువకుడు వెంటనే ఒక పెద్ద నౌక బొమ్మ గీశాడు. అలా గీయడం ఆలస్యం ఆ సముద్రంలో నౌక ప్రత్యక్షమైంది. “రాజా… ఈ నౌకలో తూర్పు వైపు బయలుదేరండి. రెండు రోజుల తర్వాత బంగారు కొండ వస్తుంది. కావలసినంత బంగారాన్ని నింపుకొని తిరిగి రండి” అన్నాడు. రాజు ‘సరే’ అని సంబరంగా నావ ఎక్కి కొందరు సైనికులతో బంగారుకొండ వైపు దూసుకుపోయాడు.
అతను పోయిన కాసేపటికి ఆ యువకుడు సముద్రం మీద పెద్ద తుఫాను విరుచుకుపడుతున్నట్టు, ఆ నౌకను చుట్టుముడుతున్నట్టు గీశాడు. అంతే… భయంకరమైన గాలులు మొదలయ్యాయి. చెట్లు కిందికి మీదికి ఊగిపోసాగాయి. అలలు ఆకాశమంత ఎత్తు ఎగిరి పడసాగాయి. నల్లని చీకటి చుట్టుముట్టుకుంది. సూర్యుడు మబ్బుల్లో మాయమయ్యాడు. ఆకాశం ఉరుములు మెరుపులతో దద్దరిల్లసాగింది. ఆ భయంకరమైన తుఫానులో రాజు ఓడ చిక్కుకొని చూస్తుండగానే అది ముక్కలు ముక్కలై మునిగిపోయింది. దుర్మార్గుడైన రాజు చనిపోయిన విషయం తెలిసి ప్రజలందరూ పండగ చేసుకున్నారు.
ఆ యువకుడు తిరిగి సముద్రంలోని ఆ బంగారు కొండను మాయం చేసి తన ఇంటికి చేరుకున్నాడు. మాయాకుంచెతో ఎప్పటిలాగే పేద ప్రజలకు సాయం చేస్తూ హాయిగా జీవించసాగాడు.
*******************
డా.ఎం. హరి కిషన్ – కర్నూలు – 9441032212
*******************
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...
Prev Post