అలంపూర్ రాజకీయం… యూటర్న్ తీసుకున్న ఎమ్మెల్యే..!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ గద్వాల, అలంపూర్ స్థానాలను మాత్రమే దక్కించుకున్న విషయం పాఠకులకు విదితమే. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా.. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో పాటు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సైతం పార్టీ మారడం దాదాపు ఖరారు అయినట్లేనని ప్రచారం జరిగింది. ఈ మేరకు చల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా కలవడం కూడా ఆ ప్రచారానికి బలం చేకూరింది. దీంతో బీఆర్ఎస్ , కాంగ్రెస్ శ్రేణులలో అయోమయ పరిస్థితి నెలకొంది.

గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ రంగ ప్రవేశం చేసి తన ఓటమికి ప్రధాన బాధ్యుడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అని.. వారిని పార్టీలో చేర్చుకోవద్దు అంటూ గట్టిగా తన బాధ వినిపించి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సంపత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. తమకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు, ఎమ్మెల్యేపై సంపత్ కుమార్ ఘాటు విమర్శలు చేశారు. అయినప్పటికిని ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీలో చేరితే నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందని పలుమార్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పార్టీ మార్పు కోసం ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు తమ పార్టీ ఎమ్మెల్యే లేడు అన్న భావన కలగకుండా కార్యక్రమాలలో పాల్గొంటుండగా.. బీఆర్ఎస్ శ్రేణులు తమ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికిని.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కొంతకాలం పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మౌనంగా ఉండి పోవడంతో నియోజకవర్గ ప్రజలు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పని పరిస్థితుల్లో యాక్టివ్

కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఇక తమకు ఉండవు అన్న సంకేతాలు రావడంతో.. ఎమ్మెల్యే విజయుడు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పలు కార్యక్రమాలకు వెళుతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సారథ్యంలో నిర్వహించే సమావేశాలలో చురుకుగా పాల్గొంటున్నాడు. దీంతో ఎమ్మెల్యే తప్పని పరిస్థితుల్లో బీఆర్ఎస్ లోనే కొనసాగుతారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కాగా ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్సీగా గెలుపొందిన చల్లా వెంకట్రాంరెడ్డి నియోజకవర్గానికే కాదు.. రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీ శ్రేణులలో అయోమయ పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కత్తి మీద సామే. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల వ్యవహార శైలి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా ఉంటుంది అని రాజకీయ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. బిఆర్ఎస్ లో ఉండి అభివృద్ధి చేయకపోవడం.. కాంగ్రెస్ లో చేరకపోవడం వంటి కారణాలతో పాటు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయుడిని గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరే పరిస్థితి లేకపోవడంతో.. స్థా నిక సంస్థల ఎన్నికలను ఎదురుకోవడం బీఆర్ఎస్ కు కత్తి మీద సామే అని పలువురు రాజకీయ నిపుణులు అంటున్నారు.