రాబోయే కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎల్‌నినో ప్రభావం వల్ల రాబోయే కరువు పరిస్థితులను బాధ్యతాయుతంగా ప్రజలకు వివరించి అప్రమత్తం చేస్తున్నట్టుగా తెలిపారు. ఎల్‌నినో ప్రభావం, రాబోయే కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అక్టోబర్‌లో మొదలైన కరువు జూలై వరకు కొనసాగుతుందని చెప్పారు. ఎండల తీవ్రత పెరిగి నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సాగు నీరు సంగతి పక్కనబెడితే, తాగునీరుకు కూడా కష్టాలు వచ్చే పరిస్థితులు వస్తాయని చెప్పారు. సమస్య చిన్నదిగా మొదలై.. పెద్దదిగా మారుతోందని అన్నారు.

ఇప్పుడు సమస్య చిన్నగానే ఉన్న… ఏప్రిల్, మే నెలల వరకు భూతంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని… ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి, తాగడానికి చుక్క నీరు దొరకని పరిస్థితి రాబోతుందని చెప్పుకొచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించకుండా, అప్రమత్తం చేయకుండా, వారిని భాగస్వామ్యం చేయకుండా ఈ కరువు పరిస్థితులను ఎదుర్కొలేమని పేర్కొన్నారు. నిజాలను ప్రజలకు వెల్లడించకపోత, అన్ని రకాలుగా దెబ్బతింటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ప్రజాభవన్‌లో శుక్రవారం (అక్టోబర్ 23) టీపీసీసీ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ అధికారంలో ఉండటం వల్లనే కరువు వచ్చిందంటూ రాజకీయ దురుద్దేశంతో ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు సహా మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో ఎల్‌నినో ప్రభావం ఉందని చెప్పారు. చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.