ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో ఓయూను అభివృద్ధి చేసుకుందాం…. మీకోసం రూ.1,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి ఏ అభ్యంతరం లేదు” -సీఎం రేవంత్ రెడ్డి….
ఉస్మానియా యూనివర్శిటీకి ఎంతో చరిత్ర ఉంది.. దేశ రాజకీయాలను శాసించిన ఎంతో మంది నేతలు ఈ యూనివర్శిటీ నుంచి వచ్చిన విద్యార్థులేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్శిటీలో పర్యటించారు. సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్ ఉస్మానియాకు వెళ్లారు. ఈ సందర్భంగా పలు భవనాలను ప్రారంభించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. ప్రొఫెసర్ ఎమ్మెల్సీగా ఉంటే తప్పేంటి..? ఢిల్లీ వరకు వెళ్లి కోదండరామ్ పై కుట్రలు చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ ను 15రోజుల్లో చట్టసభలకు పంపుతా.. ఎవరు అడ్డు వస్తారో చూస్తా అంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..ఉస్మానియా యూనివర్శిటీ పదం, తెలంగాణ పదం అవిభక్త కవలలు. తెలంగాణ ఉద్యమ పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీ. ఉస్మానియా యూనివర్శిటీలో శివరాజ్ పాటిల్ నుంచి పీవీ నర్సింహారావు వరకు చదివిన వారే. దేశ, రాష్ట్ర రాజకీయాలను ఏలుతున్న ప్రముఖ నాయకులు ఉస్మానియా యూనివర్శిటీ బిడ్డలేనని సీఎం రేవంత్ అన్నారు.
CM REVANTH REDDY OSMANIA UNIVERSITY
ఒక జార్జ్ రెడ్డి – గద్దర్ లను అందించిన గడ్డ ఉస్మానియా యూనివర్శిటీ. తెలంగాణ సమాజానికి సమస్య, సంక్షోభం వచ్చిన సమయాల్లో మొదటి చర్చ ఉస్మానియా యూనివర్శిటీలోనే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి మరో పోరాటాన్ని నేర్పిన నేల ఉస్మానియా యూనివర్శిటీ. తెలంగాణ రాష్ట్ర సాధన కలను సాధించిన గడ్డ ఈ ఉస్మానియా యూనివర్శిటీ అని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, క్యాన్సర్ లెక్క కొద్దికొద్దిగా ఉస్మానియా యూనివర్శిటీని నిర్వీర్యం చేసే కుట్ర చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైస్ ఛాన్సిలర్లను నియమించామని రేవంత్ రెడ్డి అన్నారు..ఉద్యమంలో కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని పట్టించుకోలేదు. మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి తెలంగాణ కోసం అమరుడయ్యాడు. శ్రీకాంత చారి అమరుడైనందుకు ఆయన కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదు. యాదయ్య తెలంగాణకోసం అమరుడయ్యాడు. ఇలా ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. కానీ, వారి కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదని రేవంత్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్లపై పరోక్షంగా రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలకు అధికారం పోయిందన్న ఆవేదన ఉంటది. కొడుకును ఏదో చేద్దాం అనే ఆలోచనలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. నేను చదివింది.. పెరిగింది తెలంగాణలోనే. నేను చదువుకోవడానికి గుంటూరు పోలేదు. మా తాతలు, తండ్రులు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులుగా లేరు. నేను చెట్టుపేరు మీద చింతకాయలు అమ్ముకునే రకం కాదు. మా మంత్రులు, నేను ప్రజలకు అందుబాటులో ఉంటామని రేవంత్ రెడ్డి అన్నారు..
గతంలో కళకళలాడిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం కళా విహీనంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓయూలో రూ.90 కోట్లతో నిర్మించిన వసతి గృహ భవనాలను ఆయన ప్రారంభించారు. వాటికి దుందుభి, బీమా వసతి భవనాలుగా నామకరణం చేశారు. కొత్తగా డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు..
ఓయూది గొప్ప చరిత్ర : చదువుతో పాటు పోరాటాన్ని నేర్పింది ఉస్మానియా వర్సిటీయేనని, యాదయ్య తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులయ్యారని గుర్తు చేశారు. ఉస్మానియా వర్సిటీకి ఐపీఎస్, ఐఏఎస్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులను అందించిన గొప్ప చరిత్ర ఉందన్నారు. వందేళ్లలో ఓయూకు వీసీగా దళితుడిని నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న సీఎం, గత పాలకులు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేయాలని చూశారని మండిపడ్డారు.
“విద్యా ప్రమాణాలు పెంచుకోవాలంటే నేను చేయగల్గింది ఏంటో చెప్పండి. పేదరికం మాకు కొత్తదనం కాదు, చుట్టం కాదు. పేదరికం మా జీవన విధానంలో ఒక భాగం. విద్యార్థులు మీకు ఇబ్బంది కలిగించిన వారికి మీ నిరసన తెలపండి. మీ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వాళ్లను అడ్డుకుంటే అభివృద్ధి ఎలా జరుగుతుందో ఆలోచించుకోవాలి. ప్రపంచంలో పోటీపడేటట్లుగా ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో ఓయూను అభివృద్ధి చేసుకుందాం. మీకోసం రూ.1,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి ఏ అభ్యంతరం లేదు” -సీఎం రేవంత్ రెడ్డి..