పనిచేశాం కానీ చెప్పుకోలేకపోతున్నాం..
ఫ్లెక్సీలతో కాదు.. ప్రజల్లో ఉంటేనే గెలుస్తాం: మీనాక్షీ నటరాజన్
ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చెప్పుకుందామన్న ఆలోచనే మనం చేయట్లేదు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఉద్యోగ, ఉపాధి కల్పన సహా అనేక అంశాల్లో కొత్త ఒరవడి సృష్టించాం. కాంగ్రెస్ పార్టీకి మోడల్ స్టేట్‌గా తెలంగాణ మారనుంది. బీజేపీ చెప్పే గుజరాత్ మోడల్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ మోడల్‌ను కాంగ్రెస్ తీసుకోవచ్చు. ఇది.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావణం తీసుకురానుంది. ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను నేతలే తీసుకోవాలి” అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎక్కడా జరగని కులగణనను పూర్తి చేయడం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచామని గుర్తు చేశారు. వంద శాతం పారదర్శకత, కచ్చితత్వంతో కులగణన చేసినందునే.. దీనిని ఎవరూ కోర్టుల్లో సవాల్ చేయలేకపోతున్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు సైతం శాశ్వత పరిష్కారం చూపగలిగామని చెప్పారు. 55,163 ఉద్యోగాల భర్తీతోపాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 50 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంటు, రూ.500కు గ్యాస్ సిలెండర్, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. వంటి పథకాలను ఏడాదిలోనే అమలు చేశామన్నారు. ఇలా.. అన్ని విధాలుగా తెలంగాణను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ”మంచిని మైక్‌లో, చెడును చెవిలో చెప్పాలని పెద్దలు చెబుతుంటారు. కానీ.. మనోళ్లు నా దగ్గరకు వచ్చినప్పుడు పథకాలు బాగున్నాయంటూ తలుపులు మూసి చెవిలో చెబుతున్నారు. బయట మైకులో మాత్రం ఎలా చెప్పాలో.. అలా చెబుతున్నారు. ఇది పార్టీకి తీవ్ర నష్టాన్ని తెచ్చి పెడుతోంది. అలా కాకుండా మంచిని మైకులో చెప్పి.. చెడును తన చెవిలో చెప్పాలి. పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం” అని వ్యాఖ్యానించారు..