ఆకాశంలో డ్రోన్లు, భూమిపై క్షిపణులు, తుపాకులతో సాగిన పోరు ఇప్పుడు భూగర్భానికి చేరింది…!

ఉక్రెయిన్‌,, రష్యా యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకు ఆకాశంలో డ్రోన్లు, భూమిపై క్షిపణులు, తుపాకులతో సాగిన పోరు ఇప్పుడు భూగర్భానికి చేరింది. శత్రువుల డ్రోన్లు, ఫిరంగి దాడుల నుంచి తప్పించుకునేందుకు ఉక్రెయిన్‌ సైనికులు పాత సోవియట్‌ కాలం నాటి గ్యాస్‌ పైప్‌లైన్‌ను యుద్ధ క్షేత్రంగా మార్చుకున్నారు. ఉత్తర-తూర్పు ఖార్కివ్‌ ప్రాంతంలో దాదాపు ఏడు నెలలుగా ఈ భూగర్భ పోరాటం కొనసాగుతోంది.

కేవలం మీటరుకు పైగా వ్యాసం ఉన్న ఈ పైప్‌లైన్‌లో సైనికులు నిలబడేందుకు కూడా వీలులేదు. పాకుతూ మాత్రమే ముందుకు సాగాలి. అయినప్పటికీ ఆకాశంలో నిరంతరం తిరిగే డ్రోన్లు, ఫిరంగి గుళ్లు, గ్లైడ్‌ బాంబుల నుంచి రక్షణ ఉండటంతో ఉక్రెయిన్‌ సైన్యం దీనిని వ్యూహాత్మక స్థావరంగా ఉపయోగిస్తోంది.

పైప్‌లైన్‌ లోపలికి వెళ్లేందుకు ప్రత్యేకంగా విద్యుత్‌తో నడిచే చిన్న వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనికి సైనికులు ‘కుప్యాన్స్క్‌ మెట్రో’ అని పేరు పెట్టారు. ఈ భూగర్భ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్‌ వెలెస్‌’ అని పేరు పెట్టారు. స్లావిక్‌ పురాణాల్లో పాతాళ లోకానికి సంబంధించిన దేవుడి పేరును దీనికి పెట్టడం విశేషం. ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటివరకు పైప్‌లైన్‌ వెంబడి 15 కిలోమీటర్ల మేర ఉక్రెయిన్‌ సైన్యం ముందుకు సాగినట్లు సమాచారం…ఈ క్రమంలో రష్యా సైనికులు ఏర్పాటు చేసిన అడ్డంకులను తొలగిస్తూ, బాంబులు అమర్చిన ప్రాంతాలను దాటుకుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అయితే, ఈ పోరాటం పైకి కనిపించినంత సులభమేమీ కాదు. పైప్‌లైన్‌లో గ్యాస్‌ వాసన, దుర్వాసనతో కూడిన గాలి, నీరు, మట్టి మధ్య సైనికులు కాలం గడుపుతున్నారు. కొందరు నెలల తరబడి భూగర్భంలోనే ఉంటున్నారు.

నిరంతరం మోకాళ్లపై కదలడం వల్ల గాయాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇరుకైన ప్రదేశంలో ఎక్కువకాలం ఉండటంతో కొందరికి తీవ్ర ఆందోళన, భయాందోళనలు కూడా కలుగుతున్నాయి.

ఈ ఆపరేషన్‌లో ఉక్రెయిన్‌కు చెందిన 13వ ఖార్టియా బ్రిగేడ్‌తో పాటు కొలంబియా నుంచి వచ్చిన వందలాది మంది స్వచ్ఛంద సైనికులు కూడా పాల్గొంటున్నారు. పైప్‌లైన్‌లో కేవలం 500 మీటర్ల దూరం ముందుకు వెళ్లేందుకే తమకు 30 రోజులు పట్టిందని ఓ కొలంబియా సైనికుడు తెలిపాడు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ సైన్యం 100 మందికి పైగా రష్యా సైనికులను మట్టుబెట్టడంతో పాటు 30 మందిని బందీలుగా పట్టుకున్నట్లు పేర్కొంది.