భారత్‌తో కలిసి పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం : జీఈ సీఈవో

భారత్‌ చేపట్టిన ఐదోతరం యుద్ధ విమానాల ప్రాజెక్టు కోసం ఇంజిన్లను తయారుచేసేందుకు తమ సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు అమెరికాకు చెందిన జనరల్‌ ఎలక్ట్రిక్‌ సీఈవో లారీ కల్ప్‌ వెల్లడించారు..ఈ ప్రాజెక్టుతో పాటు ఆమ్కా (అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌)కు ఇంజిన్లు అందించే కాంట్రాక్టు కోసం పోటీపడతామని పేర్కొన్నారు. పౌర, మిలిటరీ వైమానిక రంగ కార్యకలాపాల్లో భారత్‌ను ఓ ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే తేజస్‌ మార్క్‌-1ఏ ఫైటర్‌ జెట్‌ కోసం ఎఫ్‌-404 ఇంజిన్ల సరఫరాను వేగవంతం చేస్తామని జీఈ సంస్థ చెప్పింది. వాస్తవానికి వీటి సరఫరాల్లో ఇప్పటికే చాలా జాప్యం నెలకొంది. భారత్‌ మొత్తం 99 ఇంజిన్లు ఆర్డర్‌ పెట్టగా.. మార్చి నాటికి కేవలం ఒకటి మాత్రమే అందించింది. అనుకున్న దానికంటే రెండేళ్లు జాప్యం జరిగింది. దీనిపై జనరల్‌ ఎలక్ట్రిక్‌ సీఈవో లారీ కల్ప్‌ మాట్లాడుతూ ”విడిభాగాల సరఫరాలను పెంచేందుకు మా సప్లయర్స్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే.. ఏప్రిల్‌-మే నెలల్లో పురోగతి సాధించాము” అని ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్‌లో తమకు అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు వాణిజ్య విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

వాస్తవానికి తేజస్‌ ఎంకే-1ఏ ప్రాజెక్టులో జరుగుతున్న జాప్యంపై ఇప్పటికే పలుమార్లు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఉత్పాదక శక్తికి ఉన్న పరిమితుల వల్ల వైమానిక దళ, వాణిజ్య విమానాల డెలివరీల్లో జాప్యం చోటుచేసుకొంటోంది..ప్రస్తుతం జీఈ సంస్థ భారత్‌ విమానాల్లో 1,400 ఇంజిన్లను వాడుతుంది. వీటిల్లో చిన్న, పెద్ద విమానాలు ఉన్నాయి. భవిష్యత్తులో వీటి సంఖ్య 2,500కు చేరవచ్చు.