ప్రముఖ గాయని, ‘దక్షిణ భారత..
గానకోకిల’గా పేరుగాంచిన ఎస్. జానకి గారు కన్నుమూశారు. దశాబ్దాల పాటు తన గానంతో కోట్లాది మంది సంగీత ప్రియులను అలరించిన ఆమె మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఎస్. జానకి మృతి పట్ల చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. “తెలుగు గడ్డ ముద్దుబిడ్డ అయిన జానకమ్మ గారు ఇక లేరన్న వార్త తీవ్ర విచారానికి గురిచేసింది. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన తన అసాధారణ సంగీత ప్రస్థానంతో ఎన్నో తరాలను తన కాలకతీతమైన గాత్రంతో ఓలలాడించారు. భారతీయ సంగీతానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం” అని చంద్రబాబు కొనియాడారు.
ఆమె కుటుంబ సభ్యులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు, సంగీత ప్రపంచానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. జానకి గారి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని ఆయన అన్నారు.
సంగీత దర్శకురాలు, అభిమానులంతా ‘జానకమ్మ’ అని ప్రేమతో పిలుచుకునే,
సినీ నేపథ్య గాయని ఎస్.జానకి (శిష్ఠ్ల శ్రీరామమూర్తి జానకి) మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు(KCR) సంతాపం ప్రకటించారు. గాన కోకిలగా ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్న జానకమ్మ గాత్రం అజరామరమని కేసీఆర్ అన్నారు.చిన్ననాటి నుండే సంగీతం, గానం పట్ల మక్కువతో సినీ నేపథ్యగాయనిగా తన ప్రస్థానాన్ని సాగించిన జానకమ్మ, 60 యేండ్ల సంగీత జీవితంలో దాదాపు 50 వేల పాటలు పాడి, భారత సంగీతవనంలో పాటల కుసుమాలను పూయించిన మహోన్నత గాయని అని కేసీఆర్ కొనియాడారు. సినీ నేపథ్యగాయనిగా, సంగీత దర్శకురాలిగా.. తెలుగు, తమిళ ,కన్నడ, మళయాళీ.. తదితర భారతీయ భాషల్లో పాటలు పాడుతూ సినీ సంగీత జగత్తుకు చేసిన కృషి దేశ సాంస్కృతిక రంగంలో జానకి సువర్ణాధ్యాయాన్ని లిఖించిందని కేసీఆర్ అన్నారు.