వైభవ్ ఒక్కడే విఫలమయ్యాడా..?.పాపం బుడ్డోడు పై గంభీరం..!

కోచ్ గౌతమ్ గంభీర్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు మ్యాచ్‌లకే టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టడాన్ని తప్పుబడుతున్నారు..ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది.

వైభవ్ సూర్యవంశీ, వాషింగ్టన్ సుందర్‌లపై వేటు వేసిన టీమ్‌మేనేజ్‌మెంట్.. వారి స్థానాల్లో సంజూ శాంసన్, సూర్యాన్ష్ షెడ్గేలకు అవకాశం ఇచ్చింది. టీమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నామని టాస్ సందర్భంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు..మా జట్టులో రెండు మార్పులు చేశాం. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాన్ష్ షెడ్జ్, వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చారు. ఒక జట్టుగా భవిష్యత్తులో మాకు ఏది ఉత్తమమో దాన్నిప్రయత్నించడానికి ఇదే సరైన సమయమని నేను భావిస్తున్నాను. దాని ఆధారంగానే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం.’అని శ్రేయస్ అయ్యర్ వివరణ ఇచ్చాడు.

వైభవ్ ఒక్కడే విఫలమయ్యాడా..?

అయితే ఈ నిర్ణయాన్ని భారత అభిమానులు తప్పుబడుతున్నారు. కేవలం మూడు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడనే కారణంతోనే వైభవ్ సూర్యవంశీని తప్పించడం సరికాదని కామెంట్ చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీతో పాటు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబే కూడా దారుణంగా విఫలమయ్యారని, వారికి అండగా నిలిచి వైభవ్‌ను తప్పించడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గంభీర్.. నీకో దండం రా అయ్యా..

గంభీర్ విధానం ఏంటో తమకు అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. ‘గంభీర్.. నువ్వేంటో.. నీ విధానం ఏంటో అస్సలు అర్థం కాదు’అని సెటైర్లు పేల్చుతున్నారు. ‘గంభీర్ నీకో దండం రా అయ్యా’అని విమర్శలు గుప్పిస్తున్నారు. వీలైనంత త్వరగా గంభీర్‌ను హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జట్టులోని ప్రతీ ఒక్కరి ఆత్మవిశ్వాసంతో గంభీర్ ఆటాడుకుంటున్నాడని మండి పడుతున్నారు.

మూడు మ్యాచ్‌లకే అవకాశం కోల్పోయిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంత బాధపడి ఉంటాడోనని, అతను దీన్ని ఎలా స్వీకరిస్తాడోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు.