భారత్‌-పాక్‌ యుద్ధాన్ని ఆపింది నేను కాదు.. నేను కేవలం సలహా మాత్రమే ఇచ్చాను.: ఎట్టకేలకు అంగీకరించిన ట్రంప్‌..

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది తానేనంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) పదేపదే పాట పాడిన సంగతి తెలిసిందే..దీనిపై స్పందించిన భారత ప్రధాని మోదీ (PM Modi).. ఈ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేదీ లేదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో దీనిపై మరోసారి మాట్లాడిన ట్రంప్‌.. ఎట్టకేలకు వాస్తవాన్ని అంగీకరించారు. ఇందులో తన జోక్యమేమీ లేదని.. భారత్‌-పాక్‌ (India-Pakistan) దేశాలే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని అన్నారు.

పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌కు ట్రంప్‌ విందు ఇచ్చిన అనంతరం ఓవల్‌ ఆఫీసులో వీరిద్దరూ మీడియా ముందుకువచ్చారు. ఈసందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. ”చాలా తెలివైన ఇద్దరు వ్యక్తులు (భారత్‌-పాక్‌ దేశాధినేతలను ఉద్దేశిస్తూ).. యుద్ధాన్ని కొనసాగించకూడదని నిర్ణయించారు. లేదంటే ఆ పరిస్థితులు అణుయుద్ధానికి దారితీసేవే. ఆ రెండూ అణుశక్తి కలిగిన దేశాలు. అందుకే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయి” అని పేర్కొన్నారు. అంతేగాక.. భారత్‌, పాకిస్థాన్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందాలపై తాము పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

భారత్‌-పాక్‌ ఒప్పందంలో మీ ప్రమేయం లేదు..

ట్రంప్‌నకు తేల్చిచెప్పిన మోదీ
భారత్, పాకిస్థాన్‌ మధ్య గత నెలలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేమీ లేదని మోదీ నిన్న తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకే ఫోన్‌లో చెప్పానని మోదీ తెలిపారు. తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని భారత్‌ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు.

మోదీతో ఫోన్‌లో చర్చల అనంతరం కూడా ట్రంప్‌ తొలుత పాత పాటే పాడారు. ‘మంచిది. నేను యుద్ధాన్ని ఆపా. పాకిస్థాన్‌పై నాకు ప్రేమ ఉంది. మోదీ అత్యద్భుత వ్యక్తి అని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత 24 గంటలు గడవకముందే అమెరికా అధ్యక్షుడు దీనిపై వెనక్కి తగ్గడం గమనార్హం..